Bandi Sanjay:  24 గంటల కరెంట్‌పై రాజీనామాకు సిద్ధమా?:బండి సంజయ్

26 Feb, 2023 04:21 IST|Sakshi

 అధికారం ఇస్తే ఉచిత విద్య, వైద్యం

 24 గంటల కరెంట్‌పై రాజీనామాకు సిద్ధమా?

 సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ సవాల్‌  

రానున్న శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 90 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు, టీడీపీ కలిసి గుంపుగా పోటీ చేయబోతున్నాయని, బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలో 10 లోక్‌సభ స్థానాల్లో గెలుపు ఖాయమన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ‘ప్రజాగోస బీజేపీ భరోసా’సమావేశంలో బండి సంజయ్‌ పాల్గొన్నారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని చెప్పారు. మోటార్లకు మీటర్లు పెడతాం.. రుణాలివ్వాలని కేంద్రానికి లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వమేనని తాను సవాల్‌ విసిరితే ఇంతవరకు సమాధానం లేదని సంజయ్‌ విమర్శించారు. బీజేపీలో సీఎం అభ్యర్థి ఎవరనేది జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని చెప్పారు. కేసీఆర్‌ రాష్ట్రాన్ని దివాళా తీయించి రూ.5.30 లక్షల కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు.

నయీం ఆస్తు­లను కేసీఆర్‌ కుటుంబం దోచుకుందని, నయీం డైరీ ఎటుపోయిందని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌ ఇ­న్‌­చార్జి కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్, రాష్ట్ర నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, గూడూరు నారాయణరెడ్డి పాల్గొన్నారు.  

24 గంటల కరెంటుపై రాజీనామాకు సిద్ధమా? 

‘రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్నామని ప్రగల్భాలు పలికే సీఎం కేసీఆర్‌ ఆ విషయానికి కట్టుబడి ఉంటారా? ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తా. లేనిపక్షంలో సీఎం పదవికి రాజీనామా చేస్తారా? స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి సవాల్‌ చేస్తున్నా’అని బండి సంజయ్‌ పేర్కొన్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ డివిజన్‌ కేంద్రంలోని శివాజీ చౌక్‌ వద్ద జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఘన్‌పూర్‌లో వంద పడకల ఆస్పత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఫైర్‌ స్టేషన్‌ తదితర హామీలన్నీ అమలుకు నోచుకోలేదని, ఇక్కడినుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా పనిచేసినా ఏమీ చేయలేదని విమర్శించారు. మిషన్‌ భగీరథ కోసం కేసీఆర్‌ కుటుంబ సభ్యులు పైపుల కంపెనీలు పెట్టుకున్నారని, కోట్ల రూపాయలు దోచుకున్నారని సంజయ్‌ ఆరోపించారు. 
 

మరిన్ని వార్తలు