పోస్టర్ల కలకలం.. కేసీఆర్‌ ప్రభుత్వ హామీల అమలు ఎక్కడ?

2 Apr, 2023 12:07 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: కేసీఆర్‌ ప్రభుత్వం హామీ ఇచ్చిన పథకాలను అమలు చేయడం లేదంటూ వ్యంగ్యంగా తెలియజేస్తూ నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని బోధన్, నిజామాబాద్‌ అర్బన్, నిజామాబాద్‌ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల సెగ్మెంట్లలో అనేకచోట్ల శనివారం పెద్దఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ తెరిపించకపోవడం, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, ఎన్‌ఆర్‌ఐ సెల్, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, ఉచిత ఎరువులు, దళితులకు మూడెకరాలు తదితర పథకాల గురించి ఆయా ఫ్లెక్సీల్లో పెట్టారు.

అలాగే ఉపాధి అవకాశాలు కల్పించకుండా ప్రజలను ఉచితాల వైపు మరల్చి, విపరీతంగా చార్జీలు పెంచి, ప్రజలను మద్యానికి బానిసలు చేసినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు అనే ఫ్లెక్సీ కూడా పెట్టారు. ప్రతి ఫ్లెక్సీలో సీఎం మాట ఇస్తే తల నరుక్కుంటాడు.. కానీ ఇచ్చిన మాట తప్పడు అంటూ క్యాప్షన్‌ రాశారు. అలాగే ‘కేసీఆర్‌కు ఫామ్‌హౌస్, కవితకు దుబాయ్‌ బుర్జ్‌ ఖలీఫాలో ఫ్లాట్, ఎమ్మెల్యేకు జీ.1 మాల్, నిరుపేదలకు డబుల్‌ ఇళ్లు ఏవి?’అంటూ ఆర్మూర్‌లో హైవే వద్ద ఫ్లెక్సీ పెట్టారు. శుక్రవారం పసుపు బోర్డు గురించి ఎంపీ అర్వింద్‌ను ఉద్దేశించి వ్యంగ్యంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు కౌంటర్‌గా వీటిని ఏర్పాటు చేసినట్లు చర్చ జరుగుతోంది.

మరిన్ని వార్తలు