‘అతి’ విశ్వాసమే.. ముంచిందా?

25 Mar, 2021 01:06 IST|Sakshi

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయంతో కమలనాథుల్లో కలవరం

మంచి ఊపును చేజేతులా జారవిడుచుకున్నామనే అభిప్రాయ

సిట్టింగ్‌ స్థానమైన హైదరాబాద్‌లో క్షేత్రస్థాయికి వెళ్లని నేతాగణం

టీఆర్‌ఎస్‌పై విమర్శలకే పరిమితం

నల్లగొండ స్థానంలోనూ కనిపించని క్షేత్రస్థాయి ప్రణాళిక

నేడు లేదా రేపు అభ్యర్థిని ప్రకటించే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయంతో కమలనాథుల్లో కలవరం మొదలైంది. రెండు స్థానాల్లోనూ తమ అభ్యర్థుల ఓటమికి కారణాలను బీజేపీ విశ్లేషించుకుంటోంది. దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సాధించిన విజయాలతో వచ్చిన ఊపును (సాను కూల వాతావరణాన్ని) చేజేతులా జారవిడుచుకు న్నామన్న అభిప్రాయం ఈ సమీక్షల్లో వ్యక్తమ వుతోంది. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాల్సిన స్థానంలోనూ ఎందుకు ఓడిపోయామని పార్టీ శ్రేణుల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

హైదరాబాద్‌–రంగారెడ్డి– మహబూబ్‌ నగర్‌ నియోజకవర్గంలో ఎలాగూ గెలుస్తామన్న అతివిశ్వాసమే తమను దెబ్బకొట్టిందని, అదే టీఆర్‌ఎస్‌ విజయానికి కారణమైందన్న విశ్లేషణలు పార్టీ వర్గాల్లో జోరందుకున్నాయి. ఈ పరిస్థితుల్లో నాగార్జునసాగర్‌ ఉపఎన్నికల్లో ఎలా ముందుకు సాగాలన్న విషయంలో ముఖ్యనేతలు తర్జనభర్జన పడుతున్నారు.

ఇంకొంచెం కష్టపడితే సిట్టింగ్‌ దక్కేది
హైదరాబాద్‌ స్థానంలో తాము ఇంకొంచెం కష్ట పడితే బయటపడేవారమనే అభిప్రాయం పార్టీలో పెద్ద ఎత్తున వ్యక్తమవుతోంది. ప్రచారంలోనూ టీఆర్‌ఎస్‌ చేసే విమర్శలను తిప్పికొట్టడం పైనే ప్రధానంగా దృష్టి సారించిన పార్టీ నేతలు... కేంద్రంలో మోదీ ప్రభుత్వ విజయాలను, గెలిపిస్తే తామేం చేస్తామన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో విఫలమయ్యారనే చర్చ బహిరంగం గానే జరుగుతోంది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలపై దృష్టి సారించినంతగా, హైదరాబాద్‌ ఓటర్లపై దృష్టి పెట్టలేదని భావిస్తున్నారు.

జీహెచ్‌ఎంసీలో కొత్తగా గెలిచిన కార్పొరేటర్లను సమన్వయం చేసుకుని వారి సేవలను వినియోగిం చుకునే విషయంలో కొంత వెనుకబడ్డామన్న భావన పార్టీ వర్గాల్లో నెలకొంది.  ఇక నల్లగొండ– ఖమ్మం–వరంగల్‌ నియోజకవర్గంలోనూ క్షేత్ర స్థాయికి వెళ్లడంలో వెనుకబడటం వల్లే నాలుగో స్థానానికి పడిపోవాల్సి వచ్చిందని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇంకొంచెం కష్టపడితే తమకు సిట్టింగ్‌ స్థానం దక్కేదన్న భావన కమలనాథుల్లో వ్యక్తమవుతోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి, తమకు మధ్య తొలి ప్రాధాన్యత ఓట్లలో 8 శాతమే తేడా ఉండటాన్ని ఉదహరిస్తున్నారు.

ఈ స్వల్ప వ్యత్యాసాన్ని భర్తీ చేసే విధంగా క్షేత్రస్థాయి కేడర్‌ను కదిలించడంలో పార్టీ నాయకత్వం విఫలమైందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ఈ స్థానంలోని వేయి బూత్‌లలో ఒక్కో బూత్‌ నుంచి అదనంగా 10 చొప్పున ఓట్లను పొందేందుకు ఇంకొంచెం కష్టపడితే గెలుపు దక్కేదని విశ్లేషణలు చేస్తున్నారు. మరోవైపు ప్రతి 25 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జిని నియమించినా ప్రయోజనం చేకూరలేదని, వారు నిరంతరం ఓటర్లతో టచ్‌లో ఉండటంలో విఫలమయ్యారని అభిప్రాయపడుతున్నారు.

క్రమశిక్షణగల పార్టీగా పేరున్న బీజేపీలో ఇన్‌చార్జుల స్థాయిలో విఫలమైతే భవిష్యత్తులో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు పునాదే లేకుండా పోతుందనే ఆందోళన బీజేపీ కీలకనేతల భేటీలో వ్యక్తమైనట్లు సమా చారం. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు