ట్విట్టర్‌లో పెట్రో వార్‌ !

29 Apr, 2022 04:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెట్రో ధరలపై ట్విట్టర్‌ వేదికగా కేంద్ర, రాష్ట్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణతో సహా విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలని బుధవారం ప్రధాని మోదీ కోరగా.. కేంద్రం అడ్డగోలుగా విధించిన సెస్‌లు, సుంకాలతోనే ధరలు పెరిగాయని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో ఆయన్ను విమర్శించారు. అయితే దీనికి కౌంటర్‌గా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

‘దేశంలోనే అత్యధికంగా పెట్రోల్‌పై 35.20%, డీజిల్‌పై 27% వ్యాట్‌ను తెలంగాణ విధిస్తోంది. వ్యాట్‌ ద్వారా 2014–21 మధ్య రాష్ట్రం రూ.56,020 కోట్లను ఆర్జించింది. 2021–22లో రానున్న రూ.13,315 కోట్లు కలిపితే రూ.69,334 కోట్ల భారీ మొత్తం కానుంది. ఈ డబ్బంతా ఎక్కడకు పోయింది?’ అని హర్దీప్‌ సింగ్‌ ట్వీట్‌ చేయగా, కేటీఆర్‌ గట్టిగానే బదులిచ్చారు.

‘ఎన్డీఏ ప్రభుత్వం విధించిన ఎక్సైజ్‌ సుంకాలు, సెస్‌లే ధరల పెరుగుదలకు కారణం కాదా? దేశవ్యా ప్తంగా పెట్రోల్‌ను రూ.70, డీజిల్‌ను రూ.60కి ఇచ్చేలా సెస్‌లను రద్దు చేయాలని ప్రధానికి మీరు ఎందుకు సలహా ఇవ్వరు? కేంద్రం రూ.26.5లక్షల కోట్ల సెస్‌లను వసూలు చేయడం వాస్తవం కాదా.. మీ సెస్‌ల వల్ల హక్కుగా మాకు రావాల్సిన పన్నుల ఆదాయంలో 41% వాటాలను మేము పొందలేకపోతున్నాం. సెస్‌ల రూపంలో మీరు 11.4% రాష్ట్ర వాటాలను లూటీ చేస్తున్నారు’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు