బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రచార పోరు.. బల్దియాకు 30 లక్షల రాబడి

5 Jul, 2022 17:13 IST|Sakshi

బీజేపీకి రూ. 22 లక్షలు, టీఆర్‌ఎస్‌కు రూ.3 లక్షల పెనాల్టీ

జీహెచ్‌ఎంసీకి చెత్త తరలింపు చార్జీలు రూ.5 లక్షలు

సాక్షి, హైదరాబాద్‌: దాదాపు వారం రోజులుగా జరిగిన హడావుడి ముగిసింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, విజయ సంకల్ప సభ నేపథ్యంలో బీజేపీ స్వాగత ఆర్భాట హోర్డింగులు, ఫ్లెక్సీలు.. అందుకు ప్రతిగా టీఆర్‌ఎస్‌ సంక్షేమ కార్యక్రమాల ఫ్లెక్సీలు, హోర్డింగుల యుద్ధం ముగిసింది. వీటి ఏర్పాటుకు సంబంధించి జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం విభాగానికి ట్విట్టర్‌ ద్వారా అందిన ఫిర్యాదులకు స్పందించిన సీఈసీ ఈ– చలానాలు జారీ చేస్తోంది. సోమవారం సాయంత్రం వరకు బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగులకు దాదాపు  రూ. 22 లక్షలు, టీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగులకు రూ. 3 లక్షలకు పైగా ఈచలానాలు జారీ చేసినట్లు సంబంధిత అధికారి ఒకరు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఫిర్యాదుల వరద కూడా తగ్గడంతో దాదాపుగా ఇక వీటికి బ్రేక్‌ పడినట్లే భావిస్తున్నారు.  
 
కాషాయం అలా.. గులాబీ ఇలా.. 
► బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతరత్రా అతిరథ మహారథులు హాజరు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ పార్టీ ప్రధానిని ఆహ్వానిస్తూ స్వాగత తోరణాలతో పాటు భారీయెత్తున ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేయడం తెలిసిందే. అందుకు ప్రతిగా తామేం తక్కువ తినలేదన్నట్లు బీజేపీ ప్రభావం కనిపించకుండా నగరమంతా గులాబీరంగు కనిపించేలా టీఆర్‌ఎస్‌ శ్రేణులు సైతం నగరంలో అమల్లో లేని పథకాలతో సహ ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ ప్రచార యుద్ధం ముగిసింది.  


► వీటి ప్రభావం ఏమేరకు పడిందో పరిశీలిస్తే రెండు పార్టీలకు వెరసీ.. రూ. 25 లక్షల పెనాల్టీలు పడ్డాయి. వీటిల్లో రూ. 2వేల నుంచి మొదలుకొని లక్ష రూపాయల వరకు పెనాల్టీలున్నప్పటికీ, రూ. 5 వేల పెనాల్టీలు అధికసంఖ్యలో ఉన్నాయి. సగటున రూ. 5 వేలు లెక్కలోకి తీసుకున్నా రెండు పార్టీలవి మొత్తం కలిపి దాదాపు 500 ఫ్లెక్సీలకు పెనాల్టీలు విధించారు. వీటిలో ఏపార్టీ ఎన్నింటికి చెల్లిస్తుంది.. ఎంత మొత్తం చెల్లిస్తుంది అనేది తెలియడానికి సమయం పట్టనుంది. గతంలోనూ ఆయా పార్టీలకు భారీగా ఈ–చలానాలు జారీ చేసినా ఎవరు  ఎన్ని చెల్లించారో సంబంధిత అధికారులు వెల్లడించలేదు. ప్రైవేట్‌ సంస్థలు పెనాల్టీలు చెల్లించకపోతే వాటిని సీజ్‌ చేస్తున్న సీఈసీ విభాగం వీరి విషయంలో ఏం చేయనుందో వేచి చూడాల్సిందే. 

చెత్త చార్జీలు రూ. 5 లక్షలు.. 
► సీఈసీ పెనాల్టీలు విధిస్తుంది తప్ప ఫ్లెక్సీలు, హోర్డింగులు తొలగించడం లేదు. వీటి తొలగింపు బాధ్యతలు జీహెచ్‌ఎంసీలోని సంబంధిత సర్కిళ్లకు అప్పగించారు. గత రెండు రోజులుగా వీటి తొలగింపు పనులు జరుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీలో సాధారణ రోజుల్లో సగటున 6500 మెట్రిక్‌టన్నుల వ్యర్థాలు వెలువడేవి కాగా వర్షాకాలం మొదలయ్యాక సగటున రోజుకు 7000 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు వెలువడుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.  

► గడచిన రెండు రోజుల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు, ఇతరత్రా ప్రచార సామగ్రి తొలగింపు మొదలయ్యాక సగటున 7600 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. రెండు రోజుల్లో మొత్తం 1223 మెట్రిక్‌ టన్నుల చెత్త అదనంగా డంపింగ్‌ యార్డుకు చేరింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి జవహర్‌నగర్‌కు వ్యర్థాలు తరలించేందుకు జీహెచ్‌ఎంసీ మెట్రిక్‌ టన్నుకు రూ. 400 ఖర్చు చేస్తోంది. ఈ లెక్కన పార్టీల ప్రచార సామగ్రి  వ్యర్థాల తరలింపునకు దాదాపు రూ. 5 లక్షలు ఖర్చయింది. అంటే ప్రధానమంత్రి నగర పర్యటన ప్రభావం  దాదాపు రూ. 30 లక్షలన్న మాట! 


బీజేపీ నేతల తిరుగు పయనం 

మూడ్రోజుల పాటు నగరంలోనే మకాం వేసి గ్రేటర్‌ కేడర్‌లో జోష్‌ నింపిన బీజేపీ జాతీయ నేతలు సోమవారం ఉదయం తిరుగుముఖం పట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఏపీలోని భీమవరం బయలుదేరారు. హోం మంత్రి అమిత్‌షా సహా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర మంత్రులు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిపోయారు. ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఇతర ముఖ్యమంత్రులు వారి రాష్ట్రాలకు పయనమయ్యారు. ఆదివారం జరిగిన విజయ సంకల్ప సభకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భారీగా జనం తరలిరావడం, రెండు గంటల పాటు పరేడ్‌ గ్రౌండ్‌ ప్రాంతమంతా మోదీ నామస్మరణలతో మార్మోగడం కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. (క్లిక్‌: పదవి కాపాడుకునేందుకు మేయర్‌ పడరాని పాట్లు!)

మరిన్ని వార్తలు