శాసన వ్యవస్థపై ‘గవర్నర్ల’ దాడి

30 Dec, 2022 01:46 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘దేశవ్యాప్తంగా సమాఖ్య వ్యవస్థ మీద దాడి జరుగుతోంది. కేరళపై ఇది ఇంకా తీవ్రంగా ఉంది. గవర్నర్ల రూపంలో శాసన వ్యవస్థలో జోక్యం చేసుకోవడం నానాటికీ పెరుగుతోంది. బీజేపీ, ఆర్‌ఎస్‌ ఎస్‌ ఎజెండాను గవర్నర్ల ద్వారా అమ లు చేసే ప్రయత్నం చేస్తున్నారు. గవర్నర్లను రాజకీయ ఏజెంట్లుగా వాడుకుని, చట్టసభల కన్నా ఉన్నతంగా చూపేందుకు కేంద్రం కుట్రపన్నుతోంది. యూనివర్సిటీ చాన్స్‌లర్ల పేరుతో ఉన్నత విద్యపై ఆధిపత్యాన్ని సంపాదించుకోవాలని చూస్తోంది. ఇది రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం’అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కేంద్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు.

గురువారం ఖమ్మంలో తెలంగాణ వ్యవసాయ కార్మికసంఘం మూడవ రాష్ట్ర మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విజయన్‌ మాట్లాడారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దేశంలో చారిత్రక ఉద్యమాలకు సీపీఎం నాంది పలికిందని, తెలంగాణ, కునప్రవేల, తెబాగలో జరిగిన పోరాటాలు ఇందుకు మచ్చుతునకలని అన్నారు.

                                    
                                                           ఖమ్మంలో జరిగిన బహిరంగ సభకు హాజరైన ప్రజలు
గురుతర బాధ్యత ఖమ్మం ప్రజలదే..
ఈ దేశంలో తామే ప్రతిపక్షమని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ ఎప్పుడూ నిజమైన ప్రతిపక్షంగా లేదని, బీజేపీకి రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీగా పనిచేస్తోందని విజయన్‌ ఆరోపించారు. బీజేపీలోకి కాంగ్రెస్‌ తన కేడర్‌ను పంపిస్తోందన్నారు. వామపక్షాల్లో సీపీఎం మాత్రమే నిజమైన ప్రతిపక్షంగా దేశంలో కనిపిస్తోందని.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ వాదానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తోందని చెప్పారు. వచ్చే పార్లమెంట్, శాసనసభ ఎన్నికల్లో సీపీఎంను దేశవ్యాప్తంగా, తెలంగాణలోనూ బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

ముఖ్యంగా ఖమ్మం ప్రజలపై ఈ గురుతర బాధ్యత ఉందని చెప్పారు. కార్మికులు, శ్రామికులు, రైతులు హక్కుల కోసం పోరాడాలని, అలాంటి పోరాటాలకు ఖమ్మం సభ నాంది కావాలని పిలుపునిచ్చారు. కాగా, సుస్థిర అభివృద్ధిలో దేశంలో కేరళ ది బెస్ట్‌ అని ఐక్యరాజ్య సమితి ప్రశంసించిందని, అలాగే ఎన్‌డీఏ ఆధీనంలోని నీతి ఆయోగ్‌ కూడా కేరళ నంబర్‌వన్‌ రాష్ట్రంగా అభివర్ణించిందని చెప్పారు. కేరళలోని ప్రభుత్వరంగ సంస్థలను మోదీ ప్రభుత్వం విక్రయించాలని చూస్తే తమ ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేసిందన్నారు. సభకు వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య అధ్యక్షత వహించారు. 

కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చే వారిదే గెలుపు
వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి చవిచూపిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. మునుగోడులో కమ్యూనిస్టుల మద్దతుతోనే గెలిచామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ చెప్పారన్నారు. పొత్తులు ఎన్నికల సమయంలోనే ఉంటాయని, వీటిపై ఇప్పటివరకు ఎక్కడా చర్చించలేదని చెప్పారు.

నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కమ్యూనిస్టులు ఎవరికి మద్దతు ఇస్తే వారిదే గెలుపు అని జోస్యం చెప్పారు. మహాసభకు రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ కార్మికసంఘం, సీపీఎం శ్రేణులు భారీగా తరలివచ్చాయి పెవిలియన్‌ గ్రౌండ్‌ నుంచి సభా ప్రాంగణం వరకు రెడ్‌షర్ట్‌ వలంటీర్లు కవాతు నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మికసంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్, పార్టీ నేతలు పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు పాల్గొన్నారు.

  

మరిన్ని వార్తలు