బీజేపీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని అమ్మేస్తుంది 

9 Jun, 2022 04:41 IST|Sakshi

నర్సాపూర్‌ బహిరంగసభలో మంత్రి హరీశ్‌రావు..

తెలంగాణ ఏర్పడ్డాక తొలి ఆర్టీసీ బస్‌ డిపోను ప్రారంభించిన హరీశ్, అజయ్‌  

సాక్షిప్రతినిధి, మెదక్‌: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఆరీ్టసీని అమ్మేస్తుందని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వేల వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ఇప్పటికే బీజేపీ సర్కారు ప్రైవేటుపరం చేసిందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆర్టీసీ విషయంలో ఆ పార్టీ విధానం ఎలా ఉంటుందో ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. బుధవారం మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలసి ఆయన కొత్తగా ఆర్టీసీ బస్‌డిపోను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్‌ల తీరును తీవ్రంగా విమర్శించారు.  

తెలంగాణ ఏర్పడ్డాక తొలి బస్‌డిపో.. 
నర్సాపూర్‌లో ప్రారంభించిన బస్సుడిపో తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి డిపో కావడం విశేషం. ఇక్కడ బస్‌డిపో ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ మూడు దశాబ్దాలుగా ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ డిపోను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాగా, ఈ సభలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ సాయిచంద్‌ ఆలపించిన తెలంగాణ ఉద్యమ గీతాలు సభలో పాల్గొన్న నేతల్లో ఉత్సాహాన్ని నింపాయి. దీంతో పలువురు నేతలు, కార్యకర్తలు నృత్యాలు చేయగా, ఓ నాయకుడు ఏకంగా రూ.ఐదు వందల నోట్లను మంత్రి హరీశ్‌రావు చుట్టూ తిప్పి.. వెదజల్లడం చర్చనీయాంశంగా మారింది.   

మరిన్ని వార్తలు