గ్రేటర్‌లోనూ కమలం వల! ఆకర్ష ఆపరేషన్‌

28 Jul, 2022 07:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కమలం ఆకర్ష ఆపరేషన్‌ వేగం పెరిగినట్లు కనిపిస్తోంది. తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటున్న నేపథ్యంలో గ్రేటర్‌ కాంగ్రెస్‌ ముఖ్య నేతలపైనా కమలం వల విసురుతోంది. హస్తం పార్టీలోని అసంతృప్తులను  చేర్చుకునేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. మరోవైపు రాజకీయ భవిష్యత్తు కోసం ఉవ్విళ్లూరుతున్న ముఖ్య నేతలపై సైతం దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సూచన మేరకు ఇప్పటికే కమలం ముఖ్యనేతలు రంగంలోకి దిగి పలువురితో సంప్రదింపులకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యనేతల చేరిక పూర్తిగా నిర్ధారణ అయి, చేరే దాకా ఆ నేతల పేర్లు బయటకు రాకుండా కమలనాథులు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. 

నగరంలోని ముఖ్య నేతే టార్గెట్‌.. 

  • కాంగ్రెస్‌ పార్టీలో  జాతీయ స్థాయికి ఎదిగిన నగరానికి చెందిన ముఖ్యనేతపై కమలం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలై ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ కీలకంగా మారినప్పటికీ.. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో ఓ నాయకుడి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారైంది. ఇటీవల తన నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ఆయనను అసంతృప్తికి గురిచేసింది.  
  • రెండోసారి అక్కడి నుంచి బరిలో దిగేందుకు నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని స్థానిక సమస్యలపై సమరం సాగిస్తుండగా.. కార్పొరేటర్‌ చేరిక ఆయన ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. పార్టీ రాష్ట్ర నాయకత్వం తనతో కనీసం సంప్రదింపులు జరపకుండా పార్టీలో చేర్చుకోవడంపై ఆయన తన అనుచరుల వద్ద అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనిని పసిగట్టిన కమలనాథులు ఆయనపై వల విసురుతున్నారు. బీజేపీతో పాత పరిచయాలు ఉన్నప్పటికీ  కాంగ్రెస్‌ పార్టీలో జాతీయ స్థాయికి ఎదిగిన కారణంగా కమలంపై మొగ్గు చూపాలా? వద్దా? అనే సందిగ్ధంలో పడిపోయినట్లు తెలుస్తోంది. 

మైనారిటీ నేతపై కన్ను.. 
నగరం నడిబొడ్డున ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి మూడు నాలుగు పర్యాయాలు బరిలో దిగి స్వల్ప తేడాతో ఓటమి పాలైన కాంగ్రెస్‌ మైనారిటీ నేతపైనా కమలం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సదరు నాయకుడితో కమలనాథులు టచ్‌లో ఉన్నారు. మజ్లిస్‌ను టార్గెట్‌గా చేసుకుని మాట్లాడే మైనారిటీ నేత ఇటీవల పార్టీ ముఖ్యనేతల నిర్ణయాలను సైతం బహిరంగా విమర్శించడం కాంగ్రెస్‌లో దుమారం రేపింది.

దీంతో ఆయనపై అధిష్టానం గుర్రుగా ఉంది. దీనిని తమకు అనువుగా మల్చుకొని పార్టీలో చేర్చుకునేందుకు కమలనాథులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ వైపు  మొగ్గుచూపుతున్నా చేరికపై మాత్రం ఇంకా స్పష్టత రానట్లు సమాచారం. మరోవైపు నగర శివారులోని కాంగ్రెస్‌ ముఖ్య నేత సైతం బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.   

(చదవండి: రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట.. రూ.10,200 కోట్ల రుణాలకు ఓకే)

మరిన్ని వార్తలు