బ్లాక్‌ ఫంగస్‌: నెల రోజుల్లో జిల్లాలో 23 కేసులు

27 May, 2021 09:02 IST|Sakshi

భయపెడుతోన్న బ్లాక్‌ ఫంగస్‌

ఆరుగురి మృత్యువాత

కోవిడ్‌ కేసులు తగ్గుముఖం

సాక్షి, నిజామాబాద్‌ : ఓ వైపు కరోనా మహమ్మారి పంజా విసురుతుంటే.. మరోవైపు బ్లాక్‌ ఫంగస్‌ ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో ఇటీవల కాలంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 23 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఆరుగురు మృత్యువాత పడ్డారు. జిల్లాలో అకస్మాత్తుగా పెరుగుతున్న కేసులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖను కలవరానికి గురిచేస్తోంది. కోవిడ్‌ తరువాత కేసులు పెరుగుతుండడంతో వైద్య ఆరోగ్యశాఖ నివారణ చర్యలకు దిగింది. ఈ ఫంగస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడం, వ్యాధిగ్రస్తులను గుర్తించడం, చికిత్సకు తరలించే చర్యలు చేపడుతున్నారు. 

ఇదీ పరిస్థితి
జిల్లాలో నెల రోజుల్లోనే 23 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదయ్యాయి. మాక్లూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గాంధీ నగర్‌లో, సిరికొండ ఆరోగ్య కేంద్రం పరిధిలోని తాళ్లరామడుగు, చీమన్‌పల్లి, పెద్దవాల్గోట్‌ గ్రామాల్లో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదయ్యాయి. అలాగే చంద్రశేఖర్‌కాలనీ ఆరోగ్య కేంద్రం పరిధిలో, ముదక్‌పల్లి, అర్సపల్లి, మెండోరా, సాలూర, మోస్రా, ఎడపల్లి ఆరోగ్య కేంద్రం పరిధిలో ఒక్కొక్కటి చొప్పున బ్లాక్‌ ఫంగస్‌ కేసులు బయటపడ్డాయి. కిషన్‌నగర్‌లో ఒకటి, మెండోరా ఆరోగ్య కేంద్రం పరిధిలో నాగాంపేటలో ఒక కేసు నమోదైంది. అత్యధికంగా దేగాం ఆరోగ్య కేంద్రం పరిధిలో ఐదు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. చేపూర్, అంకాపూర్, మగ్గిడి, ఆలూరులో రెండు కేసుల నమోదయ్యాయి. ఇందులో చీమన్‌పల్లి, పెద్దవాల్గోట్, గన్నారంతండా, సాహబ్‌పేట, నవీపేట, బోధన్‌లో ఆరుగురు మృత్యువాత పడ్డారు.  

కరోనా తగ్గిన 15 నుంచి 20 రోజుల్లో.. 
బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నిజామాబాద్‌ డివిజన్‌లోనే ఎక్కువగా నమోదయ్యాయి. కరోనా వచ్చి తగ్గిన తరువాత 15 నుంచి 20 రోజుల్లోపు ఫంగస్‌ లక్షణాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో ఇంటింటి ఆరోగ్య సర్వే చేపడుతున్న సమయంలో కొందరు కోవిడ్‌ వచ్చిన తరువాత ఎదుర్కొంటున్న ఇబ్బందులను వైద్య సిబ్బందికి తెలియజేస్తున్నారు. వెంటనే పరీక్షిస్తున్న వైద్యులు బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలుంటే తక్షణమే హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఇలా జిల్లా కేంద్రంలో 18 కేసులను హైదరాబాద్‌కు రిఫర్‌ చేశారు. ఇంటింటి సర్వేలో వెలుగులోకి రావడం వారి వివరాలను నమోదు చేసుకోవడం, మందులను అందిస్తున్నారు.

ఇటీవల కాలంలో కేసులు పెరుగుతుండడంతో వైద్య ఆరోగ్యశాఖ ఆందోళన చెందుతోంది. ఒకవైపు సర్వే సమయంలో ప్రజలకు అవగాహన కల్పిస్తుండడంతో పాటు ఫంగస్‌ లక్షణాలు ఉన్న వారిని చికిత్సకు తరలిస్తున్నారు. జిల్లాలో కొద్దిరోజుల్లోనే 23 కేసులు నమోదవడంతో ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు వైద్య సిబ్బంది కూడా కోవిడ్‌ వచ్చి తగ్గిన వివరాలను ప్రత్యేకంగా నమోదు చేసుకొని ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. దీనివల్ల ముందస్తుగానే రోగులను గుర్తించి చికిత్స అందిస్తే మేలని వైద్యాధికారులు తెలపడంతో కొన్ని రోజులుగా ఈ పద్ధతిని కొనసాగిస్తున్నారు.

తగ్గుతున్న కోవిడ్‌ కేసులు 
లాక్‌డౌన్‌ ప్రభావంతో జిల్లాలో కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొన్ని రోజులుగా కేసుల సంఖ్య భారీగా తగ్గడంతో పాజిటివ్‌ రేటు పడిపోయింది. 2000 వరకు ర్యాపిడ్‌ టెస్టులు చేస్తున్నప్పటికీ పాజిటివ్‌ కేసుల సంఖ్య 100 వరకు నమోదవుతోంది. ఈనెల 18న 210 పాజిటివ్‌ కేసులు, 19న 163, 20న 175, 21న 143, 22న 142, 23న 67, 24న 120, 25న 116, 26న 119 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ కొనసాగుతుండడంతో పాజిటివ్‌ కేసులు తగ్గుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఆరోగ్య కేంద్రాలకు కూడా టెస్టుల కోసం ఎక్కువ మంది రావడం లేదు. దీంతో జిల్లాలో పాజిటివ్‌ రేటు 6.8కు చేరింది.

ప్రత్యేక వార్డు ఏర్పాటు
బ్లాక్‌ ఫంగస్‌ కేసులు పెరుగుతుండడంతో జీజీ హెచ్‌లో చికిత్స అందించేందుకు అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. ఐదో అంతస్తులో 50 పడకలతో బ్లాక్‌ఫంగస్‌ బాధితుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పా టు చేశారు. అలాగే, వైద్యులను కూడా కేటాయించారు. బ్లాక్‌ ఫంగస్‌ కేసులు వస్తే ఇక్కడే చికిత్స అందిస్తారు. పరిస్థితి సీరియస్‌గా ఉంటే గాంధీ ఆస్పత్రికి రెఫర్‌ చేస్తారు. వార్డు ఏర్పాట్లను సూపరింటెండెంట్‌ ప్రతిమరాజ్‌ బుధవారం పరిశీలించారు. 

చదవండి: 4 గంటలు శ్రమించి.. బ్లాక్‌ ఫంగస్‌ తొలగించి..

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు