Black Fungus: పన్ను నొప్పి ఉందని వెళితే..

1 Jun, 2021 07:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  కరోనా రెండో వేవ్‌ మొదలైనప్పటి నుంచి బ్లాక్‌ ఫంగస్‌ కేసులు కూడా పెరుగుతున్నాయి. కరోనా సోకినవారిలో చాలా మంది హోం ఐసోలేషన్‌లోనే ఉంటూ మందులు వాడుతున్నారు. ఇందులో కొందరు ఇష్టమొచ్చినట్టుగా స్టెరాయిడ్లు, యాంటీబయాటిక్స్‌ ఉపయోగిస్తుండటంతో.. కరోనా నియంత్రణలోకి వచ్చినా బ్లాక్‌ ఫంగస్‌ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. బాధితులు ఏదో పంటి సమస్య అనుకుని డెంటిస్టుల దగ్గరికి వెళితే.. ఫంగస్‌ ఉన్నట్టు బయటపడుతోంది. కరోనా సోకి తగ్గినవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, దంతాలకు సంబంధించి ఏ ఇబ్బంది తలెత్తినా వెంటనే పరీక్ష చేయించుకోవాలని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మ్యూకోర్‌మైకోసిస్‌ లక్షణాలు కనిపిస్తే.. త్రీడైమన్షనల్‌ సీటీ స్కాన్‌ ద్వారా సమస్య తీవ్రతను కచ్చితంగా అంచనా వేయొచ్చని, తగిన చికిత్స తీసుకోవచ్చని చెప్తున్నారు. ఈ తరహా కేసులకు సంబంధించిన లక్షణాలు, సమస్యలు, చికిత్స తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యనిపుణులు ప్రసాద్‌ మేక, ప్రత్యూష, సూర్యదేవర నిశాంత్‌ పలు సూచనలు చేశారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. 

‘మాక్సిల్లా’ఎముకపై ముందుగా ప్రభావం 
ముక్కుకు నోటికి మధ్యలో (అంగిటిపై) ఉన్న ‘మాక్సిల్లా’ ఎముకపై ఫంగస్‌ ముందుగా ప్రభావం చూపుతుంది. దీని వెనుకవైపు చెవి, ముక్కు, గొంతు (ఈఎన్‌టీ) విభాగం పరిధిలోకి వచ్చే వ్యవస్థలు ఉంటాయి. కిందివైపు దంత సంబంధిత వ్యవస్థలు ఉంటాయి. ఫంగస్‌ చాలా వరకు ముక్కు నుంచే ప్రవేశిస్తుంది. కరోనా ఇన్ఫెక్ట్‌ అయ్యే ప్రాంతం కూడా అక్కడే ఉండడంతో సమస్య తీవ్రత పెరుగుతుంది. సైనస్‌ సంబంధిత సమస్యలు, నొప్పి అధికంగా ఉండడం వల్ల ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. అదే నోటిలో దుర్వాసన, పళ్లు కదలడం, చిగుళ్ల వాపు, చీము రావడం వంటి సమస్యలు వస్తే వెంటనే డెంటిస్ట్‌లను సంప్రదించాలి.

ఇలాంటి సమస్యలు లేదా లక్షణాలతో వచ్చిన పేషెంట్లను పరీక్షించినప్పుడు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు బయటపడుతున్నాయి. ఈ సమస్యను గుర్తించాక తీవ్రతను బట్టి ఏ భాగంలో ఎలాంటి చికిత్స చేపట్టాలనేది నిర్ణయిస్తారు. మాక్సిల్లా లేదా ప్యాలెట్‌లలో ఇన్పెక్షన్‌ పెరిగితే పన్ను లేదా పంటి చుట్టూ ఎముకను కట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ చికిత్సను ఈఎన్‌టీ, డెంటల్‌ సర్జన్లు చేస్తారు. మాక్సిల్లా ఆపరేషన్‌ అంటే డెంటల్, ప్లాస్టిక్‌ సర్జరీలు చేయాల్సి ఉంటుంది.     
– డాక్టర్‌ సూర్యదేవర నిషాంత్, డెంటల్‌ స్పెషలిస్ట్‌  

ఏమాత్రం ఆలస్యం చేయొద్దు.. 
ఈఎన్టీ, డెంటల్, ఆప్తాల్మాలజీ, న్యూరాలజీ అంశాలకు సంబంధించిన సమస్య బ్లాక్‌ ఫంగస్‌. ఇది ముక్కులోంచి ప్రవేశించి పైదవడ, సైనస్, కళ్లు, మెదడుపై ప్రభావం చూపుతుంది. ఉన్నట్టుండి దంతాలు వదులుకావడం, అక్కడక్కడా తెల్లపొక్కులు ఏర్పడటం, చిగుళ్లకు రంధ్రాల మాదిరిగా ఏర్పడి చీము కారడం, అంగిటి నల్లబడటం, పన్ను తీసేసినప్పుడు గాయం ఆలస్యంగా మానడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను కలిసి టెస్టులు చేయించుకోవాలి. ఎలాంటి లక్షణాలు లేకున్నా పైదవడ నొప్పి, వాపు వస్తే.. ఫంగస్‌ వ్యాపించిన మేర కణజాలాన్ని తొలగించాలి, యాంటీ ఫంగల్‌ డ్రగ్స్‌ ఇవ్వాలి. ఒకవేళ పైదవడ పూర్తిగా తొలగించాల్సి వస్తే.. అప్చురేటర్‌ ద్వారా వివిధ స్థాయిల్లో చికిత్స చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కనుగుడ్డు తొలగించాల్సి వస్తే ఆర్టిఫిషియల్‌ కన్నును డెంటిస్ట్‌లే అమర్చాల్సి ఉంటుంది.

ఆలస్యమైతే ప్రమాదం
బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు బయటపడిన వెంటనే ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలి. 3, 4 రోజుల్లోనే ఈ ఫంగస్‌ మెదడుకు చేరుకుని, ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు కోవిడ్‌ కారణంగా షుగర్‌ పేషెంట్లు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, స్టెరాయిడ్స్‌ ఎక్కువగా వాడినవారికి, కేన్సర్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ పేషెంట్లకు బ్లాక్‌ ఫంగస్‌ ఎక్కువగా సోకుతుంది. కోవిడ్‌ వచ్చి తగ్గినవారు.. ఫంగస్‌ లక్షణాలు ఏమైనా ఉన్నాయా, ముఖంపై నొప్పి, నల్లబారడం, ముక్కులోంచి రక్తం, కన్ను వాపు, హైఫీవర్, తరచుగా తలనొప్పి వంటివి ఏమైనా ఉన్నాయా అన్నది ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. బెటాడిన్‌ మౌత్‌వాష్‌తో తడిపిన దూది లేదా వస్త్రంతో నోటిని శుభ్రం చేసుకోవాలి.  
–ప్రసాద్‌ మేక, ప్రత్యూష మేక, డెంటిస్ట్‌లు, కిమ్స్‌ ఆస్పత్రి 
చదవండి: 
కరోనా మూడో వేవ్‌ వస్తుందా?.. వస్తే.. ఎలా గుర్తించాలి?

మరిన్ని వార్తలు