బ్లాక్‌ ఫంగస్‌తో కుడి కన్ను తొలగించిన వైద్యులు, సాయం కోసం ఎదురుచూపు

24 May, 2021 02:08 IST|Sakshi

మూడెకరాలు తనఖా పెట్టి వైద్యానికి రూ.15 లక్షల ఖర్చు చేసిన రైతన్న.. మందుల కోసం రోజుకు రూ.60 వేలు 

ఆపన్నహస్తం కోసం వేడుకోలు

సాక్షి, కాళేశ్వరం: బ్లాక్‌ ఫంగస్‌ ఓ రైతు కుటుంబాన్ని కకావికలం చేసింది. చికిత్స కోసం రూ.15 లక్షలు ఖర్చు చేయగా.. ప్రస్తుతం మందుల కోసం రోజుకు రూ.60 వేలు అవుతున్నాయి. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబం.. ఆపన్నహస్తం అందించాలని వేడుకుంటోంది.  భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం అంబట్‌పల్లికి చెందిన రైతు వావిలాల సమ్మయ్య (42) గత నెలలో కరోనా రక్కసితో పోరాడి కోలుకున్నాడు. ఇంతలోనే పక్షవాతం రావడంతో వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొంది సాధారణ స్థితికి చేరుకున్నాడు. గోరుచుట్టపై రోకలి బండలా.. వారం తర్వాత దురద మొదలై కుడి కన్ను ఎర్రగా మారింది. హన్మకొండ, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. బ్లాక్‌ ఫంగస్‌గా నిర్ధారించారు.

‘‘కంటికి ఇన్‌ఫెక్షన్‌ అయింది.. కుడి కన్నుపూర్తిగా తొలగించాలి.. లేదంటే ప్రాణానికి ప్రమాదం’అని వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో వారు తమకున్న మూడెకాల పొలాన్ని తనఖా పెట్టి రూ.15 లక్షల వరకు వైద్యానికి ఖర్చు చేశారు. శస్త్ర చికిత్స చేసి వైద్యులు కుడి కన్నును తొలగించారు. మూడు రోజుల క్రితం బాధితుడిని డిశ్చార్జి చేశారు. పది రోజుల వరకు మందులు వాడాలని సూచించారు. అయితే.. రోజుకు రూ.60 వేల వరకు మందులకు ఖర్చు అవుతోందని, కూలి పనులు చేసుకునే తమకు అంతటి శక్తి లేదని ఆపన్న హస్తం అందించి ఆదుకోవాలని సమ్మయ్య భార్య పద్మ, పిల్లలు వేడుకుంటున్నారు. సాయం చేయదలచిన వారు 8008240915లో సందప్రదించాలని కోరారు.   

చదవండి: (టాయిలెట్‌ ద్వారా కరోనా వ్యాపిస్తుందా?)

(బ్లాక్‌ఫంగస్‌ చికిత్సకు తీవ్ర కొరత.. మందులు తక్కువ.. బాధితులెక్కువ..!)

మరిన్ని వార్తలు