బ్లాక్‌ ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌.. తాజాగా హైదరాబాద్‌లోనూ..

11 May, 2021 09:28 IST|Sakshi

కాంటినెంటల్‌ ఆస్పత్రిలో ఐదుగురు కరోనా బాధితుల్లో గుర్తింపు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న చాలా మందికి ఆ సంతోషం ఎక్కువ రోజులు ఉండట్లేదు. బ్లాక్‌ ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ రూపంలో మళ్లీ అనారోగ్య సమస్యలు తలెత్తుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఢిల్లీ, అహ్మదాబాద్, మహారాష్ట్రలో మాత్రమే బయటపడిన ఈ ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ తాజాగా హైదరాబాద్‌లోనూ వెలుగు చూసింది. హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో ఐదుగురు కరోనా బాధితుల్లో ఈ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు గుర్తించారు. బ్లాక్‌ ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకిన వారిలోనూ కరోనా లక్షణాలే కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా చికిత్సలో భాగంగా అడ్డగోలుగా స్టెరాయిడ్స్‌ వాడుతున్న వారిలో రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో ఈ బ్లాక్‌ ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువగా కనిపిస్తోందని ఆస్పత్రి ఈఎన్‌టీ వైద్యుడు డాక్టర్‌ దుశ్యంత్‌ తెలిపారు.

వాతావరణంలో ఉంటుంది.
ఈ ఫంగస్‌ ముక్కు నుంచి రక్తనాళాలకు వెళ్లి కండరాలు, ఎముకలను దెబ్బ తీస్తుంది. ఇది ప్రాణాలకే ప్రమాదం. వాతావరణంలో సహజంగా ఉండే మ్యుకోర్‌ అనే ఫంగస్‌ వల్ల ఇది వ్యాపిస్తుంది. అవయవ మార్పిడి చికిత్సలు చేయించుకున్న వారికి, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి, కోవిడ్‌ చికిత్సలో హై డోస్‌ స్టెరాయిడ్స్‌ వాడటం, ఇంటి పరిసరాలు, ఆస్పత్రి పరిసరాల్లో పరిశుభ్రత లోపించడం వల్ల ఇది వ్యాపిస్తుంది. మధుమేహంతో బాధపడుతున్న వారికి గ్లూకోజ్‌ స్థాయిని మానిటరింగ్‌ చేస్తూ స్టెరాయిడ్స్‌ ఇవ్వాలి. కోవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత ముక్కు, నోటిలో పొక్కులు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి’అని డాక్టర్‌ దుశ్యంత్‌ వివరించారు.

చదవండి: 

కరోనా నుంచి కోలుకున్నా.. కొత్త ముప్పు! 
‘కింగ్‌ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక ఎవరూ చనిపోలేదు’

మరిన్ని వార్తలు