‘బ్లాక్‌ మ్యాజిక్‌ పేరుతో బ్లాక్‌ మెయిల్‌, రూ.30 లక్షలకు డీల్‌’

17 May, 2021 08:25 IST|Sakshi

గుప్తనిధుల కోసం డీల్‌

డీల్‌ను పక్కదారి పట్టించి బ్లాక్‌మెయిల్‌ 

రాంమూర్తి హత్య కేసును ఛేదించిన పోలీసులు 

ఆరుగురు నిందితుల అరెస్టు, రిమాండ్‌ 

కుషాయిగూడ: గుప్తనిధులు తీసే ముందు చేసే క్షుద్రపూజలు (బ్లాక్‌ మ్యాజిక్‌ పవర్‌) కోసం చేసుకున్న డీల్‌ కాస్తా బెడిసికొట్టింది. బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడి అడిగిన సొమ్ము ఇవ్వకపోవడంతో ఓ వ్యక్తిని అతి కిరాతకంగా చంపిన కేసును కుషాయిగూడ పోలీసులు ఛేదించారు. ఆరుగురిని రిమాండ్‌కు తరలించారు. వివరాలను ఆదివారం కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్‌ మన్మోహన్‌ వెల్లడించారు.

నాగార్జునగర్‌ కాలనీకి చెందిన ఆంటోనీ మోసిస్‌ లారెన్స్‌ ఆలియాస్‌ శ్రీకాంత్‌ ప్యాబ్రికేషన్‌ పనిచేస్తూ స్థానికంగా చెగోడిల బట్టీ నిర్వహిస్తున్నాడు. గుప్తనిధులు తవ్వకాలు చేసే క్రమంలో క్షుద్రపూజలు నిర్వహించడం ప్రవృత్తిగా పెట్టుకొని పూజల పేరుతో బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. 

రూ.30 లక్షలకు డీల్‌
ఆల్విన్‌కాలనీకి చెందిన ఎలక్ట్రీషియన్‌ కొట్రా శ్రీనివాస్‌రెడ్డి, కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన బిల్డింగ్‌ కాంట్రాక్టరు రాంమూర్తి (61) మిత్రులు. ప్రకాశం జిల్లాలో తనకు కొంత వ్యవసాయ భూమి ఉందని, అందులో గుప్తనిధులు వెలికి తీయాలంటే క్షుద్రపూజలు చేయాల్సి ఉంటుందని రాంమూర్తి శ్రీనివాస్‌రెడ్డితో అన్నాడు. దీంతో తనకు తెలిసిన వ్యక్తి ఉన్నాడని, ఈ నెల 5న రాంమూర్తిని కుషాయిగూడ, నాగర్జుననగర్‌ కాలనీలో నివసించే ఆంటోనీ లారెన్స్‌ ఇంటికి తీసుకెళ్లాడు.

భూమికి సంబంధించిన పత్రాలు, ఫొటోలను ఆంటోనీకి  చూపిన రాంమూర్తి రూ.30 లక్షలకు డీల్‌ కుదుర్చుకున్నారు. ఈ నెల 11న అమావాస్య రోజు పూజలు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఈ నెల 10న సాయంత్రం శ్రీనివాస్‌రెడ్డి, రాంమూర్తి బైక్‌పై కూకట్‌పల్లి నుంచి బయలుదేరి ఆంటోనీ ఇంటికి చేరుకున్నారు. ఆంటోనీ కొత్త నాటకానికి తెర తీశాడు.
(చదవండి: ‘మాకు నచ్చిందే చెబుతాం, అది అంతే, మేమింతే’)

కాళభైరవ శక్తుల పేరుతో..
భూమి పత్రాలు, ఫొటోలకు పూజలు చేసే క్రమంలో కాళభైరవ శక్తులు నా కుటుంబ సభ్యులపై పడి వారు అనారోగ్యానికి గురయ్యారని, రూ.30 లక్షల వరకు ఖర్చు అయ్యిందని, ఆ డబ్బులు ఇవ్వాలని రాంమూర్తిని బ్లాక్‌ మెయిల్‌ చేయడం ప్రారంభించాడు. రూ.7 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. రాంమూర్తి డబ్బులు సమకూర్చే ప్రయత్నం చేశాడు. ఫలితం లేకపోవడంతో కర్రలతో కొట్టారు. ఈ నెల 12న అతడిని బట్టీ వద్దకు తీసుకెళ్లారు.  

చెరువులో మృతదేహాన్ని పడేసి.. 
డబ్బులు రాకపోవడంతో రాంమూర్తిని చంపేసి అతడి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, రూ.56 వేల నగదు తీసుకొని సమీపంలో నాగారం, అన్నారం చెరువులో 
మృతదేహాన్ని పడేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ వెల్లడించారు. ఆంటోనీ, శ్రీనివాస్‌రెడ్డితో పాటు వారికి సహకరించిన శాగంటి వాణిసాగర్, జిత్తుసింగ్, మనోజ్‌సింగ్, ఆంటోనీ భార్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. మూడు బైక్‌లు, బంగారు గొలుసు, ఆరు సెల్‌ఫోన్లు, గోల్డ్‌ రింగ్, రూ.7 వేల నగదు స్వా«దీనం చేసుకున్నారు. నిందితులపై చిలకలగూడ, అంబర్‌పేట్, నాచారం పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఆరు చైన్‌ స్నాచింగ్‌ కేసులు ఉన్నట్లు తెలిపారు. 
(చదవండి: కాపురాన్ని సరిదిద్దుకుని సంతోషంగా వెళ్తుంటే..)

మరిన్ని వార్తలు