గంట.. ఉత్కంఠ!

3 Sep, 2020 01:52 IST|Sakshi
శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రంలో చెలరేగుతున్న మంటలు  

శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో మళ్లీ మంటలు

నీళ్ల మోటార్ల లోడుతో విద్యుత్‌ కేబుళ్లపై నుంచి వెళ్లిన డీసీఎం

స్పార్క్‌తో చెలరేగిన మంటలు.. క్షణాల్లో నిలిచిపోయిన విద్యుత్‌ 

భయంతో ఉద్యోగుల పరుగులు 

కాలిబూడిదైన కేబుళ్లు, గంటలోపే విద్యుత్‌ పునరుద్ధరణ

ఇదంతా మాక్‌డ్రిల్లే: అధికారులు

సమయం: బుధవారం సాయంత్రం 5:30 గంటలు
ప్రదేశం: నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రం
(గత నెల 20న విద్యుత్‌ ప్రమాదం జరిగిన ప్రాంతం).
సందర్భం:   విద్యుత్‌ కేంద్రం బయట వర్షం. 
కేంద్రం ప్రవేశద్వారం వద్ద ఒక్కసారిగా ఎగిసిన మంటలు.. 
భయంతో అధికారులు, ఉద్యోగుల పరుగులు.

సాక్షి, నాగర్‌కర్నూల్‌: అసలేం జరుగుతుందో తెలి యదు. ఒక్కసారిగా చెలరేగిన మంటలతో శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో క్షణాల వ్యవధిలోనే విద్యుత్‌ నిలిచిపోయింది. విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటికి పరుగులు తీశారు. అప్పటికే బయట కురుస్తున్న వర్షానికి తడిసి ముద్దయ్యారు. వెంటనే రంగంలో దిగిన అగ్నిమాపక వాహనం మంటల్ని ఆర్పింది. సుమారు గంటసేపు తీవ్ర ఉత్కంఠతో ఉన్న ఉద్యోగులు, అధికారులకు అదంతా మాక్‌డ్రిల్‌ అంటూ ఉన్నతాధికారుల నుంచి అందిన వార్త ప్రాణం పోసినట్టుయింది. 

గత నెల 20న అగ్నిప్రమాదం జరిగిన శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలోని నాలుగో యూనిట్‌లో పునరుద్ధరణ పనులు సాగుతున్నాయి. వంద మందికిపైగా ఉద్యోగులు, అధికారులు, కార్మికులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. అదే సమయంలో విద్యుత్‌ కేంద్రం ప్రవేశద్వారం నుంచి నీళ్ల మోటార్ల లోడుతో వెళ్తున్న డీసీఎం.. నేల మీద ఉన్న విద్యుత్‌ తీగలపై నుంచి వెళ్లింది. దీంతో షార్ట్‌సర్క్యూట్‌ అయి ఒక్కసారిగా పెద్ద శబ్దాలతో మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే విద్యుత్‌ నిలిచిపోయింది. ఆ సమయంలో పునరుద్ధరణ పనులు చేస్తున్న సిబ్బంది అంతా అయోమయానికి గురై బయటికి పరుగుతీశారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక యంత్రం (ఫైర్‌ ఎక్స్‌టెన్షన్‌)తో మంటలను ఆర్పారు. విద్యుత్‌ కేంద్రంలో రెండోసారి జరిగిన ప్రమాదం వార్త వెంటనే సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసింది. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులందరూ ఉలికిపడ్డారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై అనేక చర్చలు మొదలయ్యాయి. ఇలా సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు (గంట పాటు) ఉత్కంఠ నెలకొంది. తర్వాత ఇది మాక్‌డ్రిల్‌ అని తేలడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.

మాక్‌డ్రిల్‌పై భిన్నాభిప్రాయాలు
అధికారులు నిర్వహించిన ఈ మాక్‌డ్రిల్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత నెల 20న అగ్నిప్రమాదం జరిగిన తర్వాత అందులో పనిచేస్తున్న తమకు ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని అందులో పనిచేసే ఓ ఉద్యోగి తెలిపారు. 15 రోజుల క్రితం జరిగిన ప్రమాదం నుంచి ఇంకా తేరుకోని తమను మాక్‌డ్రిల్‌ పేరిట భయపెట్టే యత్నం చేయడం ఆవేదన కలిగించిందన్నారు. మరోవైపు బయట వర్షం కురుస్తున్న సమయంలో విద్యుత్‌ కేంద్రంలో మాక్‌డ్రిల్‌ ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా 15రోజుల నుంచి ఆ కేంద్రంలో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దీంతో దోమలపెంట సబ్‌స్టేషన్‌ నుంచి విద్యుత్‌ కేంద్రానికి కేబుళ్లు వేసిన అధికారులు వాటి ద్వారా లైట్లు, మోటార్లు నడిపిస్తున్నారు. మాక్‌డ్రిల్‌తో ఆ కేబుళ్లు కాలిపోయాయి. తర్వాత రంగంలో దిగిన అధికారులు కేబుళ్లు మార్చి విద్యుదుత్పత్తిని పునరుద్ధరించారు.  (ఇక్కడ ప్రమాదం జరిగింది.. నేను చనిపోవచ్చు.. )

ప్రమాదం కాదు.. మాక్‌డ్రిల్‌
శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. సిబ్బంది అప్రమత్తతను పరిశీలించేందుకే రహస్యంగా మాక్‌డ్రిల్‌ నిర్వహించాం. ఈ కేంద్రాన్ని పరిశీలించేందుకు విశ్రాంత అధికారి అజయ్‌తో కలిసి వెళ్లా. ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలో తెలిపేందుకు ఈ కార్యక్రమం చేపట్టాం.
– ప్రభాకర్‌రావు, సీఎండీ, టీఎస్‌ ట్రాన్ ్సకో, జెన్‌ కో

మరిన్ని వార్తలు