అంతర్జాతీయ ప్రమాణాలతో ‘ఆనర్స్‌’

12 Nov, 2021 04:37 IST|Sakshi
కోర్సు ప్రత్యేకతలు వివరిస్తున్న లింబాద్రి తదితరులు 

ఆర్థిక లోతుపాతుల్లోకి వెళ్లేలా కోర్సుల ప్రణాళిక 

సామాజిక స్పృహ మేళవించే బోధన 

బీఏ (ఆనర్స్‌) పాఠ్య ప్రణాళికను వెల్లడించిన నిపుణులు 

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీపడేలా రాష్ట్రంలో బీఏ (ఆనర్స్‌) పాఠ్య ప్రణాళిక రూపొందించినట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. సామాజిక, ఆర్థిక అంశాలపై విస్తృత అవగాహన, బహుళజాతి సంస్థల్లోనూ ఉపాధి అవకాశం కల్పించగల నైపుణ్యం అందించడమే కోర్సుల ముఖ్య లక్ష్యమని చెప్పింది. సివిల్స్‌ వంటి జాతీయ పోటీ పరీక్షల్లో సైతం నెగ్గుకొచ్చే ప్రమాణాలు ఆనర్స్‌ కోర్సుల ప్రత్యేకతలని తెలిపింది.

ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కాబోతున్న బీఏ(ఆనర్స్‌) పాఠ్య ప్రణాళిక, ప్రత్యేక తలను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి నేతృత్వంలో నిపుణులు గురువారం విలేకరులకు వివరించారు. కోఠి ఉమెన్స్‌ కాలేజీలో పొలిటికల్‌ సైన్స్, నిజాం కాలేజీలో ఎకనమిక్స్‌ ప్రవేశపెట్టామని, ఈ నెల 20 వరకూ ప్రవేశం పొందవచ్చన్నారు. వచ్చే ఏడాది నుంచి మరికొన్ని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులతో విస్తరించనున్నట్లు ఓయూ వీసీ ప్రొ.డి.రవీందర్‌ చెప్పారు. ఉన్నత విద్యా మండలి వైఎస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ వెంకటరమణ, కోఠి ఉమెన్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ విజ్జుల్లత, నిజాం కాలేజీ ప్రిన్సిపాల్‌ నారాయణ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు