చట్టపరంగా ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు: ఎమ్మెల్యే షకీల్‌

18 Mar, 2022 16:18 IST|Sakshi

హైదరాబాద్‌: బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ పేరుతో స్టిక్కర్‌ ఉన్న కారు జూబ్లీహిల్స్‌లో గురువారం రాత్రి బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అభం శుభం తెలియని రెండు నెలల చిన్నారి మృతి చెందింది.

ఈ ఘటనపై తనకు ఎటువంటి సంబంధం లేదని ఈరోజు(శుక్రవారం) ఉదయం పేర్కొన్న బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌.. ఆ కారు తమ బంధువులదని మరొకసారి వెల్లడించారు. సాక్షి’తో మాట్లాడిన ఆయన.. ప్రమాదానికి గురైన కారు తమ బంధువులదని, ఓ ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందన్నారు, ఇటీవలే కారును తమ బంధువులు కొనుగోలు చేశారన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పానని,చట్టపరంగా పోలీసులు ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చన్నారు. ఈ ఘటనలో రెండేళ్ల చిన్నారి చనిపోవడం బాధిస్తుందన్నారు. 

కాగా,మహారాష్ట్రకు చెందిన కాజల్‌ చౌహాన్, సారికా చౌహాన్, సుష్మ భోస్లే రోడ్డుపై బుడగలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో వారు వ్యాపారం ముగించుకుని జూబ్లీహిల్స్‌ వైపు వెళ్తుండగా.. దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి వైపు నుంచి మహేంద్రా థార్‌ కారు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.45 వైపు అతివేగంగా వచ్చి వారిని ఢీకొంది.

ఈ ఘటనలో కాజల్‌ చౌహాన్‌ కుమారుడు అశ్వతోష్‌ (2 నెలలు) తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన కాజల్, సారికా చౌహాన్, సుష్మా భోస్లేలను అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న వ్యక్తి అక్కడి నుంచి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. 

ఇద్దరు అరెస్ట్‌ చేసిన పోలీసులు
జూబ్లీహిల్స్‌లో కారు ప్రమాదానికి కారణమైన మీర్జాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీర్జాతోపాటు అతని కుమారుడ్ని కూడా అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు