Bonalu Festival 2021: లాల్‌దర్వాజ బోనాలు: పాతబస్తీలో సందడి

2 Aug, 2021 00:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాతబస్తీలో బోనాల సందడి ప్రారంభమైంది. 113వ లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆషాడం బోనాల ఉత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల దర్శనార్థం రెండు లైన్ల ఏర్పాటు చేశారు. బోనాలు తీసుకువచ్చే మహిళలకు ప్రత్యేక క్యూలైన్‌ ఏర్పాటు చేశారు.

 

లాల్‌ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆషాడ మాస బోనలు ఘనంగా జరుగుతున్నాయని, నేడు లాల్‌ దర్వాజ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు. సోమవారం రంగం కార్యక్రమంతో పాటు, ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో లాల్ దర్వాజ బోనాలు జరుగుతున్నాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాల పండగను ప్రభుత్వం అధికారికంగా గుర్తించిందని పేర్కొన్నారు. ప్రభుత్వమే బోనాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని చెప్పారు.

ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించామని, కరోనను పారద్రోలి అందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు తెలిపారు. ఈసారి కురిసిన మంచి వర్షాలకు కృష్ణ, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులు నిండిపోయాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొని అమ్మవారిని  దర్శించుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శనము చేసుకోవాలని ఆలయ నిర్వాహకులు సూచిస్తున్నారు. ఆలయం వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

లాల్‌ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి బీజేపీ నేత విజయశాంతి బోనం సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏడేళ్ల క్రితం బంగారు బోనం ఎత్తుకుంటానన్న మొక్కును బోనం సమర్పించి తీర్చుకున్నట్లు తెలిపారు. కరోన తగ్గాలని, అందరిని కాపాడాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. మంచి పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, రాబోయే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తే బంగారు బోనం సమర్పిస్తా అని మొక్కుకున్నట్లు తెలిపారు. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లాల్‌ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి దర్శించుకున్నారు. ఆనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య తెలంగాణ రావాలని విజయశాంతి మొక్కుకున్నారని చెప్పారు. అమ్మవారు చాలా శక్తి వంతమైనవారని ఎక్కడ చూసిన పండగ వాతావరణం కనిపిస్తోందని పేర్కొన్నారు.కరోనా మహమ్మరిని నుంచి దేశ ప్రజలను కాపాడాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు.  

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. లాల్ దర్వాజ బోనాలకు విచ్చేసిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. తను హైదరాబాద్‌లోనే డాక్టర్‌గా పని చేశానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధిగా ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి మనమంతా బయటపడాలని అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు బోనం సమర్పించినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు