కన్నుల పండుగగా బల్కంపేట అమ్మవారి కళ్యాణం

5 Jul, 2022 17:03 IST|Sakshi

హైదరాబాద్‌: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం మంగళవారం కన్నుల పండుగగా, అత్యంత ఘనంగా జరిగింది. ఆలయం ముందు నిర్మించిన భారీ షెడ్డు క్రింద వేదపండితుల మంత్రోచ్ఛారణలతో అమ్మవారి కల్యాణం నిర్వహించారు. అమ్మవారి కళ్యాణాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఆలయ పరిసరాలు మొత్తం జనసంద్రంగా మారాయి.రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. 

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ దంపతులు అమ్మవారి కల్యాణం లో పాల్గొన్న అనంతరం ఆలయం లోపల అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీ క్యూ లైన్ లలో నిల్చున్నారు. 

ఆలయం పక్కన నూతనంగా నిర్మించిన షెడ్డులో కూడా భక్తులు కూర్చొని అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించారు. భక్తులు అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించేలా ఎల్‌ఈడీ స్క్రీన్ లను కూడా ఏర్పాటు చేశారు. అమ్మవారి కళ్యాణంలో టీఎస్‌ఎమ్‌ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎంపీ కవిత, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ దంపతులు, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కార్పొరేటర్ లు మహేశ్వరి, సరళ, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణ గౌడ్, ఈవో అన్నపూర్ణ, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు