స్మశానవాటిక పనులను పర్యవేక్షించిన మేయర్‌

9 Aug, 2020 11:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేస్తున్న బేగంపేట్‌ స్మశానవాటిక పనులను జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. '5 ఎకరాల విస్తీర్ణంవున్న ఈ స్మశానవాటికలో నిర్మాణ, శిథిలాల వ్యర్థాలను తొలగించి 150 లారీలలో తరలించారు. అలాగే 50 లారీల తుమ్మ, ఇతర కంప చెట్లను తొలగించారు. అభివృద్ధిలో భాగంగా అంతర్గత రోడ్లు, నీడనిచ్చే చెట్ల మొక్కలు, పూల మొక్కలను క్రమపద్ధతిలో నాటుతున్నారు.  (శవాలపైనా కాసులవేట!)

ఒక వైపు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కాంపౌండ్ వాల్ ఉండగా.. అభివృద్ధిలో భాగంగా రోడ్డు వైపు కాంపౌండ్ వాల్ నిర్మించారు. ప్రస్తుతం మూడున్నర ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నారు. నాలుగు దహన వాటికల ఫ్లాట్ ఫార్మ్స్, దింపుడుకల్లం, పార్కింగ్, సీటింగ్, స్నానపు గదుల వసతులు కల్పిస్తున్నారు. తదుపరి విద్యుత్ దహనవాటికను నిర్మించనున్నారు. ఈ దహన వాటికకు ఎదురుగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్థలంలో ఇప్పటికే చెట్లు ఏపుగా, దట్టంగా పెరిగాయి. ఈ స్మశాన వాటికలో చేపట్టిన అభివృద్ధి, సుందరీకరణ పనులతో మరో ఆరు నెలల్లో ఆహ్లాదకరమైన స్మశానవాటికగా మారనుంది' అని మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు