సింగరేణి కార్మికులకు శుభవార్త

16 Oct, 2020 08:44 IST|Sakshi

సాక్షి, రామగుండం: బొగ్గు గని కార్మికుల పీఎల్‌ఆర్‌ బోనస్‌ ఖరారైంది. రాంచీలో గురువారం జరిగిన జేబీసీసీఐ స్టాండర్డయిజేషన్‌ కమిటీ సమావేశంలో ఫెర్ఫార్మెన్స్‌ లింక్‌డ్‌ రివార్డు(పీఎఆర్‌) బోనస్‌పై నిర్ణయం తీసుకున్నారు. కోలిండియా యాజమాన్యాలతోపాటు జాతీయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇరువర్గాల చర్చల అనంతరం రూ.68, 500గా నిర్ణయించారు. గతేడాది రూ.64,700 చెల్లించగా, ఈ ఏడాది మరో 3,800 పెంచారు.

సమావేశంలో కోలిండియాలో ఆయా సంస్థల నుంచి ఎన్‌సీఎల్‌ సీఎండీ పీకే.సిన్హా, సీఐఎల్‌ డైరెక్టర్‌ ఆర్‌పీ.శ్రీవాత్సవ, సంజీవ్‌సోని, ఎస్‌ఈసీఎల్‌ నుంచి డైరెక్టర్‌ ఆర్‌ఎస్‌ జా, డబ్ల్యూసీఎల్‌ నుంచి డైరెక్టర్‌ సంజయ్‌కుమార్, ఈసీఎల్, సీసీఎల్‌ నుంచి వినయ్‌రాజన్, ఎంసీఎల్‌ నుంచి కేశవరావు, ఎన్‌సీఎల్‌ నుంచి బీమ్‌లేంద్‌కుమార్, సీఎంపీడీఐఎల్‌ నుంచి డైరెక్టర్‌ గోమస్తా, బీసీసీఎల్‌ నుంచి డైరెక్టర్‌ పీవీకేఆర్‌ఎం.రావు, సింగరేణి డైరెక్టర్‌ చంద్రశేఖర్, సీఐఎల్‌ కన్వీనర్‌ ఏకే.చౌదరి పాల్గొన్నారు.

జాతీయ కార్మిక సంఘాలు బీఎంఎస్‌ బీకే.రాయ్, నరేంద్రకేఆర్‌.సింగ్, హెచ్‌ఎంఎస్‌ తరఫున నాథులాపాండే, రామేంద్రకుమార్, ఏఐటీయూసీ నుంచి రామేంద్రకుమార్, సీఐటీయూ నుంచి రమణానంద్‌ పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి జరిగిన సమావేశంలో మొదట సమ్మె ప్రతిపాదన ఉన్న సమయంలో బోనస్‌పై చర్చించలేమని సీఐఎల్‌ యాజమాన్యం పేర్కొనడంతో కొంతసేపు ప్రతిష్టంభన ఏర్పడింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో బొగ్గు సంస్థలు నష్టాల్లో ఉన్నాయని బోనస్‌ చెల్లించలేమని యాజమాన్యం పేర్కొంది. జాతీయ కార్మిక సంఘాలు వ్యతిరేకించి బోనస్‌ చెల్లించాలని పట్టుబట్టాయి. ఈ క్రమంలో జాతీయ కార్మిక సంఘాలు రూ.75 వేలు డిమాండ్‌ చేయగా, చివరికి రూ. 68,500 చెల్లించేందుకు అంగీకారం కుదిరింది.

చదవండి: మరో రెండు రోజులు భారీ వర్షాలు

మరిన్ని వార్తలు