అపార్ట్‌మెంట్‌లో బోర్‌వాటర్‌ వివాదం.. వాటర్‌ట్యాంక్‌ ఎక్కి దంపతుల హల్‌చల్‌  

29 Oct, 2021 10:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, సైదాబాద్‌: అపార్ట్‌మెంట్‌లో బోర్‌నీటి వినియోగ వివాదం చినికి చినికి గాలి వానలా మారింది. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉండే మహిళ తమకు నీరు అందకుండా ఇబ్బందులు సృష్టిస్తోందంటూ పెంట్‌హౌస్‌లో నివసించే దంపతులు అపార్ట్‌మెంట్‌ వాటర్‌ట్యాంక్‌ పైకెక్కి ఆత్మహత్య చేసుకుంటామని హల్‌చల్‌ చేశారు. వివరాలు..సైదాబాద్‌ ఎల్‌ఐసీ కాలనీలోని రక్షిత అపార్ట్‌మెంట్‌లో గ్రౌండ్‌ఫ్లోర్‌లో నివసించే మహిళకు మిగిలిన పది కుటుంబాలకు కొంతకాలంగా బోర్‌వాటర్‌ వినియోగించుకోవడంపై వివాదం నడుస్తోంది. ఇరువర్గాలు గతంలో ఒకరిపై ఒకరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. మూడురోజుల క్రితం బోర్‌మోటర్‌ను గ్రౌండ్‌ఫ్లోర్‌లోని మహిళ తొలిగించింది.

దీంతో అపార్ట్‌మెంట్‌లో వారికి బోర్‌నీటి సరఫరా లేక ఇబ్బందులు తలెత్తాయి. స్థానిక నేతలను సదరు మహిళ, అపార్టుమెంట్‌ వాసుల మధ్య రాజీకి యతి్నంచినా ఫలితం లేదు. అపార్ట్‌మెంట్‌లో బోర్‌నీటి కోసం తరచూ గొడవలు జరగటంతో పెంట్‌హౌస్‌లో నివసించే ప్రేమ్‌ దంపతులు మనస్తాపానికి గురయ్యారు. గురువారం అపార్ట్‌మెంట్‌ 3వ అంతస్తులోని పెంట్‌హౌస్‌పై ఉన్న వాట ర్‌ట్యాంక్‌పైకి నిచ్చెన సహాయంతో ఎక్కారు. అక్కడి నుంచి దూకుతామని బెదిరించారు. సైదాబా ద్‌ పోలీ సులు వచ్చి వారికి సర్దిచెప్పి కిందికి దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో నివసించే మహిళ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నామని ప్రేమ్‌ దంపతులు తెలిపారు.  

మరిన్ని వార్తలు