ఎవరు గన్‌మన్లు.. ఎవరు బౌన్సర్లు?

10 Aug, 2020 03:47 IST|Sakshi

గన్‌మన్లు, లైసెన్స్‌డ్‌ తుపాకులు, బౌన్సర్లను చూపి బెదిరింపులు 

ఎవరు ఏంటో అర్థం కాని సామాన్యులు! 

బౌన్సర్లకు ప్రత్యేక కోడ్‌ ఉండాలంటున్న సామాన్యులు 

నల్లగొండ జిల్లాలో ఓ మాజీ జెడ్పీటీసీ ఆత్మరక్షణ కోసం తీసుకున్న తుపాకీని ఓ రియల్‌ఎస్టేట్‌ గొడవలో చూపించి ప్రత్యర్థులను బెదిరించి జైలు పాలయ్యాడు. ములుగు జిల్లాల్లో తన తండ్రికి కేటాయించినగన్‌మన్లను, బౌన్సర్లను చూపించి పలువురిని భయభ్రాంతులకు గురిచేస్తున్న ఓ నేత కుమారుడు.

ఆత్మరక్షణ మాటున బెదిరింపులపర్వం సాగుతోంది. లైసెన్స్‌డ్‌ గన్‌ ‘గురి’తప్పింది. ప్రభుత్వం కేటాయించిన గన్‌మన్లను, లైసెన్స్‌డ్‌ తుపాకులను కొందరు మాజీ ప్రజాప్రతినిధులు దుర్వినియోగం చేస్తున్నారు. వ్యక్తిగత వ్యవహారాల్లో తుపాకులు, గన్‌మెన్లను చూపి తమ ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇంకొందరైతే ప్రైవేటు గన్‌మన్లను పోలీసులుగా చెప్పుకుంటూ ఎదుటివారిని భయపెడుతున్నారు. దీంతో గన్‌మన్లు, లైసెన్స్‌డ్‌ గన్స్, ప్రైవేటు బౌన్సర్ల విషయంలో కొందరు నేతలు మితిమీరి ప్రవర్తిస్తున్నారన్న ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. ఇటీవల నల్లగొండ జిల్లాలో ఓ నేత ప్రైవేటు వ్యవహారంలో లైసెన్స్‌డ్‌ గన్‌ చూపి బెదిరింపులకు దిగడం కలకలం రేపింది. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

ఎంతమందికి గన్‌మెన్‌ సౌకర్యం? 
రాష్ట్రంలో ఎవరెవరికి గన్‌మెన్‌ సౌకర్యం కల్పించారు? వారికి ఎంత వ్యయం అవుతుంది? ఈ సేవలు పొందుతున్నందుకు వారేమైనా రుసుము చెల్లిస్తున్నారా? అన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ కోదాడకు చెందిన జలగం సుధీర్‌ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. దీనిపై స్పందించిన పోలీసుశాఖ ఆ వివరాలు సెక్షన్‌ 24 (4) ప్రకారం వెల్లడించలేమంటూ సమాధానం ఇచ్చింది. 

బౌన్సర్లను పోలీసులుగా.. 
ప్రాణ భయం ఉన్న పలువురు మాజీ ప్రజాప్రతినిధులకు పోలీసుశాఖ గన్‌మన్లను కేటాయించింది. లైసెన్స్‌డ్‌ గన్స్‌ మంజూరు చేసింది. ఇంకొందరు తమ వెంట ప్రైవేటు బౌన్సర్లను పెట్టుకుంటున్నారు. వారినే పోలీసులుగా చూపిస్తూ ప్రత్యర్థులను బెదిరిస్తున్నారన్న ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. హెయిర్‌ కటింగ్, సఫారీలు వేసుకోవడం, బాడీ లాంగ్వేజ్, నడుముకు తుపాకులు ఉండటంతో వీరు కూడా పోలీసులేనని జనాలు భ్రమపడిపోతున్నారు.  

స్పష్టత, పర్యవేక్షణ అవసరం.. 
ప్రభుత్వం ఎంతమందికి గన్‌మన్లతో రక్షణ కల్పించారన్న విషయం జిల్లాల వారీగా విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు. ప్రైవేటు బాడీగార్డులు, బౌన్సర్లకు ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌ ఉండాలని, వారి కదలికల సమాచారం సంబంధిత పోలీసుస్టేషన్‌కు ఉండేలా మార్పులు చేయాలని సూచిస్తున్నారు. పారదర్శకత, పోలీసుల పర్యవేక్షణ పెరిగితే అమాయకులపై బెదిరింపులు అంతగా తగ్గుతాయని అభిప్రాయపడుతున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు