తల్లిదండ్రులపై పోలీసులే కేసు పెట్టారు  

19 Sep, 2020 03:49 IST|Sakshi

ఆండ్రూస్‌ యాజమాన్యం ఏ ఫిర్యాదూ చేయలేదు..

పాఠశాల విద్య డైరెక్టర్‌ శ్రీదేవసేన హైకోర్టుకు నివేదిక..

ఇటు 55 స్కూళ్లపై ఫిర్యాదులు వచ్చాయని వెల్లడి..

సాక్షి, హైదరాబాద్‌: బోయిన్‌పల్లిలోని సెయింట్‌ ఆండ్రూస్‌ పాఠశాల ఎదుట కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి సమావేశమయ్యారనే అభియోగంతో బోయిన్‌పల్లి పోలీసులే విద్యార్థుల తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారని పాఠశాల విద్య డైరెక్టర్‌ ఎ.శ్రీదేవసేన హైకోర్టుకు నివేదించారు. పాఠశాల యాజమాన్యం కానీ, పేరెంట్స్‌ అసోసియేషన్‌ కానీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. ఆండ్రూస్‌ పాఠశాలలో గతేడాది ఉన్న ట్యూషన్‌ ఫీజులనే నెలవారీ పద్ధతిలో తీసుకుంటున్నారని వెల్లడించారు. ఆండ్రూస్‌ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేయడంపై విస్మయం వ్యక్తం చేసిన హైకోర్టు.. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని గతంలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు శ్రీదేవసేన శుక్రవారం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ‘కేంద్ర మార్గదర్శకాలు, ప్రజ్ఞా నిబంధనల మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సెప్టెంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహిస్తున్నాం.

ఫీజులు పెంచరాదని, నెలవారీగా మాత్రమే ఫీజులు తీసుకోవాలని సీబీఎస్‌సీ, ఐసీఎస్‌సీ పాఠశాలలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ప్రైవేటు పాఠ శాలలు ఫీజులు అధికంగా వసూలు చేస్తే ఫిర్యాదు చేసేందుకు వీలుగా అన్ని జిల్లాల్లో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని డీఈవోలను పాఠశాల విద్య కమిషనర్‌ ఇప్పటికే ఆదేశించారు. జీవో 46కు విరుద్ధంగా వ్యవహరించిన 55 పాఠశాలలపై ఫిర్యాదులు వచ్చాయి. ఆయా స్కూళ్లకు షోకాజ్‌ నోటీసులిచ్చాం. వీటిలో 47 పాఠశాలలు తమ వివరణను సమర్పించాయి. ఆ మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించాం. వారిచ్చే నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటాం. అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలున్న బేగంపేట గీతాంజలి పాఠశాలను ఈ నెల 7న సందర్శించాం.

ఇంకా చెల్లించాల్సిన ఫీజులో ఎక్కువగా తీసుకున్న ఫీజును మినహాయిస్తామని గీతాంజలి యాజమాన్యం హామీనిచ్చింది. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ కూడా నెలవారీగా ట్యూషన్‌ ఫీజు తీసుకునేందుకు అంగీకరించింది. నీరజ్, వాసవీ పాఠశాలల పేరెంట్స్‌ అసోసియేషన్స్‌ ఇచ్చిన వినతిపత్రాలు జీవో 46 ఉల్లంఘించినవి కావు. ఫీజులు తగ్గించాలని కోరినవే..’అని శ్రీదేవసేన నివేదికలో పేర్కొన్నారు. ఇటు ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహించకుండా, ప్రైవేటు పాఠశాలలు జీవో 46కు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేయకుండా ఆదేశాలివ్వాలంటూ హైదరాబాద్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన పిల్‌పై విచారణ అక్టోబర్‌ 8కి వాయిదా పడింది. ఈ వ్యవహారంపై తమ కౌంటర్‌ దాఖలు చేసేందుకు 2 వారాల గడువు కావాలని సీబీఎస్‌ఈ తరఫు న్యాయవాది కోరడంతో అనుమతించిన కోర్టు విచారణను వాయిదా వేసింది.

>
మరిన్ని వార్తలు