మూడు వాగులు.. మూడు గుట్టలు దాటినా.. 

13 Jul, 2021 01:05 IST|Sakshi
రాకేశ్‌ మృతదేహం

దక్కని పసివాడి ప్రాణం 

సరైన వైద్యం అందక ములుగు జిల్లాలో బాలుడు మృతి  

వాజేడు: ఆ ఊరు మూడు వాగులు.. మూడు గుట్టల వెనుక ఉంది. దారి లేదు.. వాహన సౌకర్యం అసలే లేదు. అలాంటి ఊరి నుంచి జ్వరంతో బాధపడుతున్న కొడుకును ఆస్పత్రిలో చూపిద్దామని భుజాలపై మోసుకుంటూ వచ్చారు తల్లిదండ్రులు. తీరా ప్రభుత్వ ఆస్పత్రిలో చూపిద్దామనుకునేలోపే ఆ బాలుడు ప్రాణాలు విడిచాడు. సోమవారం ములుగు జిల్లా వాజేడు మండలంలో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెనుగోలుకు  చెందిన ఉయిక శేషయ్య, కాంతమ్మలకు ముగ్గురు పిల్లలు. వారు జ్వరంతో బాధపడుతున్నారు.

ఈ గ్రామం కొంగాల గ్రామపంచాయతీ పరిధిలో గుట్టల మీద ఉంటుంది. ఆదివారం రాకేశ్‌(4)కు జ్వరం ఎక్కువ కావడంతో తల్లిదండ్రులు భుజాల మీద మోసుకుంటూ మూడు వాగులు దాటుకుని.. మూడు గుట్టలు దిగి వచ్చి పగళ్లపల్లిలో ఉన్న చుట్టాల ఇంటికి చేరుకున్నారు. అదే గ్రామంలోని ఆర్‌ఎంపీ డాక్టర్‌ వద్ద వైద్యం చేయించారు. అయినా తగ్గలేదు. సోమవారం మళ్లీ వైద్యానికి వెళ్లగా పరిస్థితి బాగా లేదని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని సూచించాడు. దీంతో శేషయ్య దంపతులు రాకేశ్‌తోపాటు జ్వరంతో ఆస్పత్రికి వచ్చారు. వైద్యులకోసం వేచి ఉండగా.. అప్పటికే ఆలస్యం కావడంతో రాకేశ్‌ మృతి చెందాడు.  

బంధువుల ఇంటిలో.. 
రాకేశ్‌ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాలంటే 15 కిలోమీటర్లు వాగులు, గుట్టలు దాటుకుని నడకదారిన వెళ్లాలి. అప్పటికే సాయంత్రం అయ్యింది. దాంతో ఊరు వెళ్లే అవకాశం లేక పోవడంతో శేషయ్య దంపతులు కొడుకు మృత దేహంతో ప్రగళ్లపల్లిలోని బంధువుల ఇంట్లోనే తలదాచుకున్నారు. సకాలంలో వైద్యం అందితే కొడుకు బతికే వాడని తల్లి కాంతమ్మ వాపోయింది. ఈ విషయంపై వైద్యాధికారి యమునను ‘సాక్షి’వివరణ కోరగా వారు ఆర్‌ఎంపీ వద్ద ఆదివారం వైద్యం చేయించుకున్నారని, సోమవారం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువస్తుండగా మార్గమధ్యలోనే బాలుడు మృతిచెందినట్లు తెలిసిందని చెప్పారు. వారు తమ ఆస్పత్రికి రాలేదని తెలిపారు.  

మరిన్ని వార్తలు