ఆపరేషన్‌ కోసం తీసుకొస్తే.. మత్తు మందే మింగేసింది

7 Sep, 2022 10:30 IST|Sakshi

 బాలుడి మృతిపై ఎంజీఎంలో కుటుంబసభ్యుల ఆందోళన

సాక్షి, వరంగల్‌: చేయి విరిగిన ఎనిమిదేళ్ల బాలు­డిని ఆపరేషన్‌ కోసం తీసుకొస్తే ప్రాణం పోయింది. అధిక మోతాదులో అనస్తీషియా ఇవ్వడంతో చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.  ఈ ఘటన వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా లింగానాయక్‌ తండాకు చెందిన భూక్యా విహాన్‌(8)కు కుడిచేయి విరిగింది. 4న   ఎంజీఎం ఆస్పత్రి ఆర్థో వార్డులో అడ్మిట్‌ చేశారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆపరేషన్‌ చేసేందుకు మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో థియేటర్‌­లోకి తీసుకెళ్లారు.

అనస్తీషియా ఇవ్వాల్సిన డోస్‌ కన్నా ఎక్కువ మోతాదులో ఇవ్వడంతో కార్డియాక్‌ అరెస్టయిం­ది. ఉదయం 10 గంటలకు ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకెళ్లిన వైద్యులు మధ్యాహ్నం 2 గంటల తర్వాత కూడా బయటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది బయట వైద్యులను అడిగారు. అనస్తీషియా ఇచ్చి ఆపరేషన్‌కు సిద్ధం చేస్తున్న సమయంలో గుండెపోటు వచ్చిందని, ఆర్‌ఐసీయూలో వెంటిలేటర్‌ ద్వారా చికిత్స అందిస్తున్నా­మని తెలిపారు. మరికొద్దిసేపటికి బాబు మృతి చెందినట్లు ప్రకటించారు. దీంతో విహాన్‌ తల్లిదండ్రులు రోదిస్తూ ఆందోళనకు దిగారు.  
చదవండి: ప్రాణం తీసిన ప్రేమ పంచాయతీ

ప్రత్యక్ష పోస్టుమార్టం: విహాన్‌ మృతదేహానికి సాయంత్రం 6 గంటల తర్వాత ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. బాలుడు ఎలా మృతిచెందాడో నిర్ధారణ కావడానికి వీడియో చిత్రీకరణ మధ్య ఫోరెన్సిక్‌ వైద్యుల సమక్షంలో పోస్టుమార్టం పూర్తి చేశారు. రాత్రి 7 గంట­­లకు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, విహాన్‌ మృతి ఘటన వివరాలను వైద్యారోగ్యశాఖ మంత్రి కార్యాలయ సిబ్బంది.. ఎంజీఎం సూపరింటెండెంట్‌కు ఫోన్‌ చేసి అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కమిటీ వేసి విచారణ చేయాలని ఆదేశించినట్లు తెలిసింది.

విచారణ చేసి చర్యలు తీసుకుంటాం..
విహాన్‌ మృతి ఘటనపై విచారణకు అదేశించామని, దీనికోసం ద్విసభ్య కమిటీ వేసినట్లు ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. కమిటీ త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు