మూడేళ్ల క్రితం కిడ్నాప్.. తర్వాత ఫోన్‌లో ఆచూకీ

21 Mar, 2021 08:37 IST|Sakshi
బాలుడు గణేశ్‌ (ఫైల్‌), మూడేళ్ల తర్వాత దొరికిన గణేష్‌

కిడ్నాప్‌కు గురైన బాలుడి ఆచూకీ లభ్యం  

హైదరాబాద్‌లో గుర్తించిన పోలీసులు  

తల్లిదండ్రుల చెంతకు గణేశ్‌  

సాక్షి,కామారెడ్డి: మూడేళ్ల క్రితం కిడ్నాప్‌నకు గురైన బాలుడి ఆచూకీ లభించింది. కిడ్నాప్‌ చేసిన వ్యక్తే సమాచారం ఇవ్వడంతో పోలీసులు బాలుడిని కనుగొన్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. వివరాలు.. 2018 ఏప్రిల్‌ 13న కామారెడ్డి పట్టణంలోని భరత్‌నగర్‌ కాలనీకి చెందిన గోపి, ఉమ దంపతుల రెండో కుమారుడు గణేశ్‌.. ఇంటి ముందు ఆడుకుంటుండగా కనిపించకుండా పోయాడు. ముగ్గురు సభ్యులు గల ముఠాలోని ఓ వ్యక్తి బాలుడిని కిడ్నాప్‌ చేశాడు. రెండు నెలల పాటు కామారెడ్డిలోనే గుట్టుచప్పుడు కాకుండా ఓ ఇంట్లో దాచి ఉంచాడు. తర్వాత మరో మహిళ ద్వారా హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ ప్రాంతంలో రూ.1.50 లక్షలకు విక్రయించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా మూడు రోజుల క్రితం కిడ్నాప్‌ చేసిన వ్యక్తే.. గణేశ్‌ కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి అతని ఆచూకీ చెప్పినట్లు సమాచారం. తన భార్య ప్రోద్బలంతోనే కిడ్నాప్‌కు పాల్పడ్డానని, తప్పు చేసినట్లుగా కుంగిపోతున్నానని చెప్పుకొచ్చినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు.. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ ప్రాంతంలో విచారణ జరపగా గణేశ్‌ ఆచూకీ లభించింది. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు ఆనందంతో మునిగి తేలారు.  

చిన్నపిల్లలే టార్గెట్‌ 
కామారెడ్డిలోని డ్రైవర్స్‌ కాలనీ ప్రాంతంలో నివాసం ఉండే భార్యాభర్తలు, మరో మహిళ కలసి చిన్నపిల్లలను కిడ్నాప్‌ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. వీరిలో ప్రధాన నిందితుడైన వ్యక్తి చిన్నపిల్లలను ఎత్తుకెళ్లడం.. అతని భార్య పిల్లలను దాచిపెట్టడం చేస్తారు. మరో మహిళ విక్రయించే పని చూసుకుంటుంది. మూడేళ్ల క్రితం గణేశ్‌ను కిడ్నాప్‌ చేశారు.

కొద్దిరోజులకు రైల్వేస్టేషన్‌ ప్రాంతంలో ఏడాది వయసు గల బాలుడిని ఎత్తుకెళ్లారు. అలాగే.. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళ రోగి వైద్య పరీక్షలు చేయించుకుంటుండగా మరో బాలుడిని అపహరించారు. ఈ కేసును పట్టణ పోలీసులు గంటల వ్యవధిలోనే దించారు. మరో బాలుడి ఆచూకీ తెలిసినప్పటికీ ఇది వరకే అతను మృతి చెందినట్లు సమాచారం. కిడ్నాప్‌ చేసిన వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా ముఠా సభ్యులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు