పదమూడేళ్ల బాలుడు.. 7 గురికి కొత్త జీవితం ఇచ్చాడు..

23 Jul, 2021 09:37 IST|Sakshi

సాక్షి, భద్రాచలం(ఖమ్మం): పట్టుమని పదమూడేళ్లు కూడా నిండని బాలుడు తన మరణంలోనూ మరో ఏడుగురికి జీవితాన్ని ఇచ్చాడు. చిన్నతనంలోనే అవయవ దానంపై ఆలోచనలు కలిగిన ఆయన మరణంలోనూ తన లక్ష్యాన్ని వదలలేదు. వివరాల్లోకి వెళ్లే... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన డాక్టర్‌ భానుప్రసాద్‌ – సీత దంపతులు సామాజిక, అన్యాయాలకు గురైన బిడ్డలను చేరదీసి విద్యాబుద్ధులు నేర్పిస్తూ సొంత బిడ్డల్లా చూసుకుంటారు. ఇలా పది మంది పిల్లలు ఉండగా, వీరిలో నాలుగో బాలుడు సిద్దూ.

ఆరో తరగతి చదివే ఆయన ఈనెల 14న తీవ్ర జ్వరం రావడంతో మెరుగైన వైద్యం నిమిత్తం 19వ తేదీన హైదరాబాద్‌లోని గ్లోబల్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగానే బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో సిద్ధూ కోరిక మేరకు గురువారం ఆయన శరీరంలో పనికొచ్చే అవయవాలను భానుప్రసాద్‌ దంపతులు అందజేసి ఉదారత చాటుకున్నారు. కాగా, ఆస్పత్రి వైద్యులు సిద్దూ నేత్రాలు, కిడ్నీలు, లివర్, ప్రాంకియాస్‌ అవయవాలను సేకరించి అవసరమైన వారికి అమర్చనుండడంతో ఏడుగురికి ప్రాణభిక్ష పెట్టినట్లయింది.  

మరిన్ని వార్తలు