ఐదేళ్ల తరువాత  అమ్మఒడికి..! 

10 Oct, 2020 06:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దర్పణ్‌ యాప్‌.. తెలంగాణ పోలీసుల పనితనానికి నిదర్శనంగా నిలిచింది. టెక్నాలజీలో నిత్యం ముందుండే రాష్ట్ర పోలీసులు.. ఐదేళ్ల క్రితం తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రుల ఒడికి చేర్చి శెభాష్‌ అనిపించుకున్నారు. వివరాలు.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్‌కు చెందిన సోమ్‌ సోని అనే బాలుడు ఆటిజంతో బాధపడుతున్నాడు. అతనికి ఎనిమిదేళ్ల వయసున్నపుడు 2015లో జూలై 14న తప్పిపోయాడు. ఈ మేరకు అలహాబాద్‌లో మిస్సింగ్‌ కేసు నమోదైంది. అక్కడి పోలీసులు ఎంత గాలించినా బాలుడి ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబసభ్యులు కూడా ఆశలు వదులుకున్నారు. కానీ, పిల్లాడు అదే నెల 23న అస్సాంలోని గలాపర పోలీసులకు తారసపడ్డాడు. దీంతో వారు స్థానిక చిల్డ్రన్స్‌ హోంకు తరలించారు. 

ముఖ కవళికల ఆధారంగా గుర్తింపు 
తప్పిపోయిన పిల్లలను గుర్తించేందుకు తెలంగాణ పోలీసులు అత్యాధునిక సాంకేతికతతో దర్పణ్‌యాప్‌ను రూపొందించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)తో పనిచేసే ఈ సాఫ్ట్‌వేర్‌ ముఖకవళికల ఆధారంగా పిల్లలను గుర్తిస్తుంది. ఇందులో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో తప్పిపోయిన, గుర్తించిన పిల్లల సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ పోలీసులు కేంద్రం ఆధ్వర్యంలోని ‘‘ట్రాక్‌ ద చైల్డ్‌ పోర్టల్‌’’నుంచి మిస్సింగ్‌ అండ్‌ ఫౌండ్‌ చిల్డ్రన్‌ డేటా సేకరిస్తున్నారు. ఈ క్రమంలో సోమ్‌ సోని ఫొటోను ఇందులో అప్‌లోడ్‌ చేశారు. వెంటనే సోని అస్సాంలోని ఓ చిల్డ్రన్‌ హోమ్‌లో ఉన్నాడని యాప్‌ గుర్తించింది. వెంటనే అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు అలహాబాద్‌ పోలీసులను, తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు.

వారు అస్సాంలోని చిల్డ్రన్‌ హోంకు వెళ్లి సోమ్‌ సోనిని కలుసుకున్నారు. సోమ్‌ తన తల్లిదండ్రులను చూసిన వెంటనే గుర్తుపట్టడం విశేషం. సోమ్‌ను చూడగానే అతని తల్లి గుండెలకు హత్తుకుని బోరున ఏడ్చింది. ఐదేళ్ల తరువాత తప్పిపోయిన పిల్లాడిని ‘దర్పణ్‌ యాప్‌’ద్వారా అమ్మఒడికి చేర్చడం తెలంగాణ పోలీసులకు గర్వకారణంగా భావిస్తున్నామని విమెన్‌ సేఫ్టీ వింగ్‌ చీఫ్, ఏడీజీ స్వాతి లక్రా ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. తమ పిల్లాడిని తిరిగి తమ వద్దకు చేర్చడంలో కీలకంగా వ్యవహరించిన తెలంగాణ పోలీసులకు సోని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.   

మరిన్ని వార్తలు