ఆగని గరికపాటి వ్యాఖ్యల దుమారం..‘ఆకాశం మీద ఉమ్మేయడం లాంటిదే’

8 Oct, 2022 08:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ సినీనటుడు చిరంజీవిని ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో దుమారమే రేగింది. హైదరాబాద్‌లో బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో ‘చిరంజీవి ఫొటో సెషన్‌ ఆపేసి రాకపోతే నేనే వెళ్లిపోతా’అని అసహనం వ్యక్తం చేశారనే అంశం వివాదానానికి దారి తీసింది. అయితే ఆ కార్యక్రమంలో చిరంజీవి, గరికపాటి బాగానే మాట్లాడుకున్నా... ఆ తరువాత నరసింహారావు వ్యాఖ్యలపై చిరంజీవి సోదరుడు నాగబాబు ట్విట్టర్‌లో ఆయన పేరు ప్రస్తావించకుండా ‘ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్‌ చూస్తే ఆ పాటి అసూయపడటం పరిపాటే’నని స్పందించారు.

నాగబాబు ట్వీట్‌పై బ్రాహ్మణ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్‌ కౌంటర్‌ ఇచ్చారు. ‘నిత్యం తన ప్రవచనాలతో సమాజాన్ని ఎంతో సంస్కారవంతం చేస్తున్న ఒక సనాతనవాది, ఆధ్యాత్మిక వేత్తను.. నటనావ్యాపారం తప్ప సమాజహితాన్ని మరిచిన చిత్రవ్యాపారిని చూసి అసూయ చెందాడనడం ఆకాశం మీద ఉమ్మేయడం లాంటిదే’ అని ఘాటుగా స్పందించారు.
చదవండి: 'మాకు ఆ ఉద్దేశం లేదు.. ఆయనను ఎవరూ తప్పుగా మాట్లాడొద్దన్న నాగబాబు'

ఆగని ట్రోల్స్‌ 
మరోవైపు చిరంజీవి అభిమానులు, నటులు గరికపాటిని సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. క్షమాపణలు చెప్పాలంటూ చిరంజీవి యూత్‌ రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్‌ గరికపాటికి ఫోన్‌ చేసి డిమాండ్‌ చేశారు. చిరంజీవి గురించి అలా అనాల్సింది కాదంటూ గరికపాటిపై సినీనటుడు ఉత్తేజ్‌ మండిపడ్డారు. ఇలా సోషల్‌ మీడియాలో పోస్టుల పరంపరం కొనసాగింది. చివరకు నాగబాబు మళ్లీ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ ‘గరికపాటి వారు ఏదో మూడ్‌లో అలా అని ఉంటారు. ఆయనలాంటి పండితుడు అలా అని ఉండికూడదని అన్నామే తప్ప, ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు. మెగాభిమానులు ఆయ నని అర్థం చేసుకోవాలే గానీ, ఆయన గురించి ఎవరూ తప్పుగా మాట్లాడవద్దని రెక్వెస్ట్‌’అని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు