అవయవదానంతో ఐదుగురికి పునర్జన్మ

4 Feb, 2021 08:10 IST|Sakshi

ఏపీలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన రైతు బాలయ్య

హైదరాబాద్‌లో  చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్‌..

కాంటినెంటల్‌కు కాలేయం, కేర్‌కు గుండె, కిమ్స్‌కు లంగ్స్‌

అపోలో, నిమ్స్‌లకు కిడ్నీలు.. ప్రత్యేక గ్రీన్‌చానల్‌ ద్వారా తరలింపు  

సాక్షి, హైదరాబాద్‌: తను కన్నుమూస్తూ మృత్యువుతో పోరాడుతున్న మరో ఐదుగురికి పునర్జన్మను ప్రసాదించాడు ఆ రైతు.. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన బాలయ్య (51) నా లుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయాలై అపస్మారక స్థితిలోకి చేరుకోగా చికిత్స కోసం బంధువులు హైదరాబాద్‌లోని కాం టినెంటల్‌ ఆస్పత్రికి తరలించారు. రెండ్రోజుల చికి త్స అందించినా ఫలితం లేకపోయింది. బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు బుధవారం ఉదయం ప్రకటించారు.

కుటుంబీకులు అంగీకరించడంతో..
అవయవదానానికి బాధితుడి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో వైద్యులు వెంటనే జీవన్‌దాన్‌కు తెలిపారు. అప్పటికే అవయవాల పనితీరు దెబ్బతి ని అవయవ మార్పిడి చికిత్సల కోసం ఎదురుచూస్తున్న బాధితులకు, వారికి వైద్య సేవలు అందిస్తు న్న ఆస్పత్రి వైద్యులకు సమాచారం ఇచ్చారు. చికిత్సకు ఆయా బాధితుల కుటుంబ సభ్యులు అంగీకరించడంతో వైద్యులు ఆలస్యం చేయకుండా వెంట నే ఏర్పాట్లు చేశారు. ఒక్కో ఆస్పత్రిలోని వైద్యులు రెండు బృందాలుగా విడిపోయారు. ఒక బృందం దాత నుంచి అవయవాలను సేకరించగా, మరో బృందం అవయవాలను స్వీకర్త చికిత్స పొందుతున్న ఆస్పత్రికి తరలించే పనిలో నిమగ్నమైంది. 

వివిధ ఆస్పత్రులకు తరలింపు
దాత నుంచి సేకరించిన అవయవాలను ట్రాఫిక్‌ పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రీన్‌ చానల్‌ ద్వారా వివిధ ఆస్పత్రులకు తరలించారు. దాత శరీరం నుంచి తొలుత ఊపిరితిత్తులను వేరు చేసి కిమ్స్‌కు తరలించారు. కాంటినెంటల్‌ ఆస్పత్రి నుంచి సికింద్రాబాద్‌ కిమ్స్‌కు మధ్య దూరం 21.7 కిలోమీటర్లు ఉంటుంది. వైద్య సిబ్బంది మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరి, మధ్యాహ్నం 3.19 గంటలకు (కేవలం 29 నిమిషాల్లో) కిమ్స్‌కు చేరుకుంది. ఆ తర్వాత గుండెను సేకరించి కేర్‌లో చికిత్స పొందుతున్న బాధితుడి వద్దకు చేర్చారు. కాంటినెంటల్‌ ఆస్పత్రి నుంచి బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రికి మధ్య దూరం 15.7 కిలోమీటర్లు ఉండగా, వైద్య సిబ్బంది మధ్యాహ్నం 2.50 నిమిషాలకు దాత నుంచి సేకరించిన గుండెను తీసుకుని బయలుదేరి మధ్యాహ్నం 3.09 గంటలకు (కేవలం 19 నిమిషాలు) బంజారాహిల్స్‌ కేర్‌కు చేరుకుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఒక కిడ్నీని జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తరలించగా, మధ్యాహ్నం 3.30 గంటలకు నిమ్స్‌కు మరో కిడ్నీని తరలించారు. ఇక కాలేయాన్ని కాంటినెంటల్‌ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న ఓ బాధితుడి వద్దకు చేర్చారు. అనంతరం ఆయా అవయవాలను వైద్య సిబ్బంది బాధితులకు విజయవంతంగా అమర్చారు.

గుండె మార్పిడి ఆపరేషన్‌ సక్సెస్‌
బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రి వైద్యుల కృషి ఫలించింది. హైదరాబాద్‌ మెట్రోలో నాగోల్‌ నుంచి 40 నిమిషాల్లోనే అపోలో ఆస్పత్రికి గుండెను తరలించిన డాక్టర్‌ ఏజీకే గోఖలే బృందం.. మంగళవారం గుండె మార్పిడి చికిత్సను విజయవంతంగా పూర్తిచేసింది. సాయంత్రం 5.15 గంటలకు శస్త్ర చికిత్స ప్రారంభించి అర్ధరాత్రి 12.30కి ముగించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆరెగూడెంకు చెందిన రైతు వరకాం తం నర్సిరెడ్డి(45) బ్రెయిన్‌ డెడ్‌కు గురవడంతో ఆయన గుండెను ఎల్బీ నగర్‌ కామినేని ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి మెట్రోలో తరలించిన సంగతి తెలిసిందే. ఆ గుండెను అపోలోలో చికిత్స పొందుతున్న 44 ఏళ్ళ వ్యక్తికి విజయవంతంగా అమర్చారు. దీంతో వైద్యులు ఆనందం వ్యక్తం చేశారు.

గుండెను తరలించిన వైద్యులకు గవర్నర్‌ సన్మానం
గుండె తరలింపు, చికిత్సను విజయవంతంగా నిర్వహించిన మెట్రోరైలు అధికారులు, వైద్యులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ బుధవారం సన్మానించారు. రాజ్‌భవన్‌లో మెట్రోరైలు ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి, ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌ ఎండీ కేవీబీ రెడ్డి, వైద్యులు గోపాలకృష్ణ గోఖలే ఈ సన్మానం అందుకున్నారు.

మరిన్ని వార్తలు