తెలంగాణ మండలి ఎన్నికలకు బ్రేక్‌

14 May, 2021 05:01 IST|Sakshi

కరోనా సెకండ్‌ వేవ్‌ పరిస్థితుల్లో ఈసీ నిర్ణయం 

ఎమ్మెల్యే కోటా ఎన్నికలపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడి 

టీఆర్‌ఎస్‌ ఆశావహుల్లో నిరాశ 

జూన్‌ 3న ఖాళీ కానున్న ఆరు ఎమ్మెల్సీ స్థానాలు 

జాబితాలో మండలి చైర్మన్‌ గుత్తా, డిప్యూటీ చైర్మన్‌ నేతి, కడియం తదితరులు 

సాక్షి, హైదరాబాద్‌: వచ్చేనెల 3న ఖాళీ అవుతున్న శాసనమండలి ఎమ్మెల్యే కోటా స్థానాలకు ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కరోనా సెకండ్‌ వేవ్‌ పరిస్థితులు మెరుగైన తర్వాత, రాష్ట్రం నుంచి అందే వివిధ నివేదికలను మదింపు అనంతరం ఎన్నికల నిర్వహణపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రజా ప్రాతినిథ్య చట్టంలోని నిబంధనల ప్రకారం వచ్చే నెల మూడో తేదీలోగా ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అవుతున్న ఆరు స్థానాలకు ఎన్నికలు జరపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన అందిన విషయాన్ని ఎన్నికల సంఘం ధ్రువీకరించింది. అయితే ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సరికాదని భావిస్తున్నట్లు పేర్కొంది. 

ఈసీకి ఇటీవల సర్కారు లేఖ 
ఎమ్మెల్యే కోటా కింద మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆరుగురు సభ్యుల పదవీ కాలం వచ్చే జూన్‌ 3న ముగియనుంది. వీరిలో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ నేతి విద్యాసాగర్, మండలిలో చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఫరీదుద్దీన్, ఆకుల లలిత ఉన్నారు. మరోవైపు గవర్నర్‌ కోటాలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రొఫెసర్‌ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పదవీ కాలపరిమితి కూడా జూన్‌ 16న ముగియనుంది. అయితే ఖాళీ అవుతున్న స్థానాలకు ఎన్నికలు జరపాల్సిందిగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలవుతుందని భావించగా, తాజాగా ఈసీ తన నిర్ణయం వెలువరించింది. 

మళ్లీ ఆరూ టీఆర్‌ఎస్‌కే.. 
సంఖ్యాబలం పరంగా టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ ఉండటంతో ఖాళీ అవుతున్న అరడజను ఎమ్మెల్సీ పదవులు తిరి గి ఆ పార్టీకే దక్కనున్నాయి. 119 మంది సభ్యులున్న శాసనసభలో టీఆర్‌ఎస్‌కు ప్రస్తుతం 104 మంది సభ్యుల బలం ఉంది. దీంతో ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న టీఆర్‌ఎస్‌ నేత లు కొంతకాలంగా పార్టీ అధినేతను ప్రసన్నం చేసుకోవడంతో పాటు నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. పదవీ విరమణ చేస్తున్న వారిలో చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తిరిగి నామినేట్‌ కావడం దాదాపు ఖాయమైంది. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మండలిలో చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లుకు కూడా అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లు సమాచారం. అయినప్పటికీ ఒకేసారి ఆరు స్థానాలు ఖాళీ అవుతుండటంతో అనేకమంది ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నారు.

సామాజికవర్గాలకు ప్రాధాన్యతపై హామీ 
ఖాళీ అయ్యే స్థానాల్లో పద్మశాలి, విశ్వ బ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, కుమ్మరి సామాజికవర్గాలకు చెందిన వారికి అవకాశం ఇస్తామని గతంలో టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో ఆయా సామాజికవర్గాలకు చెందిన వారు కూడా ఎమ్మెల్సీ పదవి ఆశిస్తుండటంతో పోటీ మరింత పెరిగింది. అయితే ఇటీవలే పద్మశాలి సామాజికవర్గానికి చెందిన మాజీ ఎంపీ గుండు సుధారాణి వరంగల్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. కాగా ఉద్యమ సమయంలో తన ఆరేళ్ల ఎమ్మెల్సీ పదవికి ఏడాదిన్నర లోపే రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.సత్యనారాయణ అవకాశం వస్తుందనే ధీమాతో ఉన్నారు.

అసెంబీ మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి కూడా పదవిని ఆశిస్తున్నారు. మరోవైపు పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావుకు గతంలోనే కేసీఆర్‌ హామీ ఇచ్చారు. అలాగే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఇటీవల ‘హైదరాబాద్‌’ పట్టభద్రుల స్థానం నుంచి టికెట్‌ ఆశించిన పీఎల్‌ శ్రీనివాస్, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యదర్శి ఎం.రమేశ్‌రెడ్డి, సాగర్‌ ఉప ఎన్నికలో టికెట్‌ ఆశించిన ఎంసీ కోటిరెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, యువజన నాయకుడు శుభప్రద్‌ పటేల్, రవీందర్‌ సింగ్, తాడూరు శ్రీనివాస్‌ తదితరులు ఆశావహుల జాబితాలో ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్న వీరంతా ఈసీ నిర్ణయంతో నిరాశలో మునిగిపోయారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు