యూరియా ఉత్పత్తి ‘గండం’ దాటేనా?

21 Feb, 2024 04:28 IST|Sakshi

ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో సాంకేతిక లోపం..

తరచూ ఉత్పత్తికి విఘాతం 

ఫలితమివ్వని విదేశీ పరిజ్ఞానం 

స్టీమ్‌లైన్‌ లోపాలతో మూణ్నెళ్లకోసారి సమస్యలు

ఫెర్టిలైజర్‌సిటీ (రామగుండం): స్వదేశీతో పాటు విదేశీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్థాపించిన రామగుండం ఫెర్టిలైజర్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌)లో యూరియా ఉత్పత్తికి తరచూ అంతరాయం కలుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సుమారు రూ.6,350 కోట్లు వెచ్చించి కర్మాగారం నిర్మించారు. ఇందుకోసం ఇటలీ, డెన్మార్క్‌ నుంచి ఆధునిక యంత్ర,సామగ్రి తెప్పించారు.

రోజుకి 2,200 మెట్రిక్‌ టన్నుల అమ్మోనియా, 3,850 మెట్రిక్‌ టన్నుల యూరియా ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నిర్మించారు. 2023 డిసెంబర్‌ 31 నాటికి 8,19,344.70 మెట్రిక్‌ టన్నుల యూరియా ఉత్పత్తి చేశారు. ఇక్కడి యూరియాకు జాతీయస్థాయిలో మంచి డిమాండ్‌ ఉంది. కేంద్ర ఎరువులు, రసాయన శాఖ రామగుండంలోని ఈ ప్లాంట్‌ను పర్యవేక్షిస్తుంది.  

పైప్‌లైన్లలో లీకేజీలతో ఉత్పత్తికి బ్రేక్‌ 
స్టీమ్‌ ఆధారంగానే ఇక్కడ యూరియా ఉత్పత్తి అవుతోంది. అయితే స్టీమ్‌ పైప్‌లైన్‌ లోపాలతో ప్రతీమూడు నెలలకోసారి ప్లాంట్‌లో సమస్యలు తలెత్తుతున్నాయి. సామర్థ్యానికి మించి పైపుల్లో స్టీమ్‌(ఆవిరి) సరఫరా కావడంతో తరచూ పైపులైన్లలో లీకేజీలు ఏర్పడి, యూరియా ఉత్పత్తి నిలిచిపోతోంది. గతేడాది నవంబర్‌ 15న ఇలాంటి సమస్య తలెత్తితే.. సుమా రు 15 రోజులపాటు మరమ్మతులు చేసి ప్లాంట్‌ను పునరుద్ధరించారు.

ప్లాంట్‌ ప్రారంభమైన కాసేపటికే మళ్లీ సాంకేతిక సమస్య తలెత్తడంతో మరో మూడురోజుల పాటు మరమ్మతులు చేయాల్సి వచ్చింది. నవంబర్‌ 25న ఉత్పత్తి పునఃప్రారంభమై యూరియా, అమ్మోనియా ఉత్పత్తి సాఫీగానే సాగింది. కానీ, ఈనెల 9న హీట్‌ స్టీమ్‌ పైప్‌లైన్‌లో మళ్లీ సమస్య తలెత్తింది. దీంతో ఉత్పత్తి నిలిచిపోవడంతో ప్లాంట్‌ షట్‌డౌన్‌ చేశారు. ఈనెల 24లోగా పనులు పూర్తిచేసి యూరియా ఉత్పత్తి పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు.  

గ్యారంటీ గడువు ముగిసిపోవడంతో 
గ్యాస్‌ ఆధారంగా నడిచే రామగుండం ఫెర్టిలైజర్‌ కెమికల్స్‌ లి మిటెడ్‌ కర్మాగారం నిర్మాణంలో విదేశీ పరిజ్ఞానం వినియోగించిన విషయం తెలిసిందే. ఇటలీ, డెన్మార్క్‌నుంచి తెచ్చిన యంత్ర, సామగ్రి గ్యారంటీ గడువు ముగిసిపోవడంతో మరమ్మతులు, నిర్వహణ భారమంతా కర్మాగారంపైనే పడుతోంది.  

ప్లాంట్‌పై ఒత్తిడి 
మన రాష్ట్రంతోపాటు ఆంధ్రా, కర్ణాటక, మహారాష్ట్రల్లో యూరియాకు డిమాండ్‌ పెరగడంతో రామగుండం ప్లాంట్‌లో నిరంతరంగా ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో ప్లాంట్‌లో తరచూ సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక ఆర్థిక సంవత్సరం చివరి దశకు చేరడం, డిమాండ్‌కు సరిపడా యూరియా ఉత్పిత్తి చేయలేకపోవడంతో అధికారులపై ఒత్తిడి పెరుగుతోందన్న వాదన వినపడుతోంది.

whatsapp channel

మరిన్ని వార్తలు