వారిద్దరి చివరి మజిలీ ఒకేరోజు ఒకే సమయంలో ముగిసింది

10 May, 2022 07:54 IST|Sakshi
శ్రీనివాస్‌, భాస్కర్‌ (ఫైల్‌)

సాక్షి,లక్సెట్టిపేట(మంచిర్యాల)/జగిత్యాలక్రైం: అన్నదమ్ముల అనుబంధాన్ని మృత్యువూ విడదీయలేకపోయింది. వారి ఇద్దరి చివరి మజిలీ ఒకేరోజు ఒకే సమయంలో ముగిసింది. అన్నదమ్ములు ఇద్దరూ చిన్నప్పటి నుంచి ఎలాంటి విబేధాలు లేకుండా కలిసిమెలిసి ఉండడం.. చివరి క్షణంలోనూ కలిసే శవయాత్ర సాగడం స్థానికులను కంటతడి పెట్టించింది. తమ్ముడి గుండెపోటుతో మృతిచెందాడన్న విషయం తెలిసి అన్న కూడా గుండెపోటుతో చనిపోయాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో విషాదం నింపింది.

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. లక్సెట్టిపేట మండల కేంద్రంలోని మహాలక్ష్మివాడకు చెందిన గాజుల సత్తయ్య, సత్తవ్వ దంపతులకు భాస్కర్, శ్రీనివాస్, మంజుల సంతానం. పెద్ద కుమారుడు శ్రీనివాస్‌ జగిత్యాల జిల్లా కేంద్రంలో చిన్న హోటల్‌ నిర్వహిస్తుండగా, చిన్న కుమారుడు భాస్కర్‌ జగిత్యాల జిల్లా ధర్మపురిలో చిరు వ్యాపారం చేస్తున్నాడు. మంజులకు వివాహం జరిగింది. తల్లిదండ్రులు లక్సెట్టిపేటలోనే ఉంటూ శేషజీవితం గడుపుతున్నారు. అప్పుడప్పుడు అందరూ ఇక్కడికే వచ్చి వెళ్తుంటారు. భాస్కర్‌కు ధర్మపురిలో సోమవారం ఉదయం ఐదు గంటలకు గుండెపోటు వచ్చిందని శ్రీనివాస్‌ కుటుంబసభ్యులకు ఫోన్‌ రావడంతో అందరూ ధర్మపురికి చేరుకున్నారు. అప్పటికే భాస్కర్‌(47) చనిపోవడంతో మృతదేహాన్ని లక్సెట్టిపేటకు తీసుకొచ్చారు.

అంతలోనే శ్రీనివాస్‌(50) స్పృహ కోల్పోయి కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇద్దరు కొడుకులు ఒకేసారి చనిపోవడం ఆ దంపతులకు తీరిన దుఃఖాన్ని మిగిల్చింది. కాగా, శ్రీనివాస్‌కు భార్య, ఇంటర్మీడియట్‌ చదివే ఇద్దరు కుమారులు, భాస్కర్‌కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతులిద్దరికీ ఒకేచోట  అంత్యక్రియలు జరిగాయి. బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, కౌన్సిలర్లు పరామర్శించారు. 

చదవండి: ప్రేమపేరుతో బాలికను మహారాష్ట్ర తీసుకెళ్లి.. గది అద్దెకు తీసుకుని.

మరిన్ని వార్తలు