గంటల వ్యవధిలోనే అన్నదమ్ములిద్దరూ గుండెపోటుతో మృతి

9 Jan, 2023 15:03 IST|Sakshi

సాక్షి, మెట్‌పల్లి (కోరుట్ల): గంటల వ్యవధిలోనే అన్నదమ్ములిద్దరూ మృతి చెందిన విషాదకర ఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో చోటుచేసుకుంది. తమ్ముడు గుండెపోటుతో మృతి చెందగా, అంత్యక్రియలకు హాజరైన అన్నకూడా గుండెపోటుకు గురై మరణించాడు.

మెట్‌పల్లి పట్టణంలోని చైతన్యనగర్‌కు చెందిన బోగ భూషణ్, లత దంపతులకు ముగ్గురు కుమారులు. ఇందులో రెండో కుమారుడు శ్రీనివాస్‌ (30) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు భార్య, ఏడాది వయసుగల పాప ఉంది. శనివారం రాత్రి ఇంట్లో ఉన్న శ్రీనివాస్‌ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే గుండెపోటుతో మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు.

మృతదేహాన్ని ఆదివారం ఉదయం మెట్‌పల్లికి తీసుకొచ్చారు. అంత్యక్రియలు జరపడానికి మృతదేహాన్ని శ్మశానికి తరలిస్తుండగా, అప్పటికే అక్కడికి వెళ్లిన శ్రీనివాస్‌ అన్న సచిన్‌ (33) ఒక్కసారిగి కూప్పకూలాడు. ఇది గమనించిన బంధువులు మొదట ప్రైవేట్‌ ఆస్పత్రికి.. ఆ తర్వాత ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సచిన్‌ మృతి చెందినట్లు తెలిపారు. గంటల వ్యవధిలోనే అన్నదమ్ములిద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషాద ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. పలువురు ప్రముఖులు ఆ కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. 

చదవండి: (Hyderabad: ఇంటర్‌ విద్యార్థులకు టెన్షన్‌ టెన్షన్‌!)

మరిన్ని వార్తలు