అందుకే ‘దర్భంగ బాంబు’ విస్ఫోటనం ఆలస్యం 

6 Jul, 2021 08:01 IST|Sakshi

అట్ట ముక్క అడ్డు పెట్టడం వల్లే!

లేదంటే తెలంగాణలోనే ఆ ఎక్స్‌ప్రెస్‌కు మంటలు

రసాయనాలతో పార్శిల్‌లో ఉంచిన బాటిల్‌   

సాక్షి, హైదరాబాద్‌: లాహోర్‌లోని ఇక్బాల్‌ ఖానా న్యూస్‌ పేపర్‌ వాడమంటే.. నగరంలో నివసిస్తున్న లష్కరేతొయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులు అట్టముక్క వినియోగించారు. ఇదే దర్భంగా ఎక్స్‌ప్రెస్‌ అగ్నికి ఆహుతి కాకుండా కాపాడింది. ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కస్టడీలో ఉన్న ఉగ్రవాదులు ఇమ్రాన్‌ మాలిక్, నాసిర్‌ మాలిక్‌ అధికారుల విచారణలో ఈ విషయం బయటపెట్టారు. మరోపక్క కేసు దర్యాప్తులో భాగంగా క్రైమ్‌ సీన్‌ రీ–కన్‌స్ట్రక్షన్‌ కోసం ఇద్దరు ఉగ్రవాదుల్నీ అధికారులు సోమవారం నగరానికి తీసుకువచ్చారు. 

ఉగ్రవాద సంస్థ ఎల్‌ఈటీ తరఫున పని చేస్తున్న ఇక్బాల్‌ ఖానా ఉత్తరప్రదేశ్‌కు చెందిన తండ్రీకొడుకులు హాజీ, ఖఫీల్‌ ద్వారా నగరంలోని మల్లేపల్లిలో నివసిస్తున్న యూపీ వాసులైన అన్నదమ్ములు ఇమ్రాన్, నాసిర్‌లను రంగంలోకి దింపారు. దర్భంగ ఎక్స్‌ప్రెస్‌లో రసాయనాల బాటిల్‌ ద్వారా విస్ఫోటనం కలిగించి భారీ అగ్ని ప్రమాదం సృష్టించడమే వీరి కుట్ర. దీనికోసం స్థానికంగా లభించే రసాయనాలతోనే బాంబు మాదిరి తయారు చేయాలని అన్నదమ్ములకు ఆదేశాలు జారీ చేశారు. 

వీరిద్దరు హబీబ్‌నగర్, చిక్కడపల్లిలోని దుకాణాల నుంచి సల్ఫ్యూరిక్, నైట్రిక్‌ యాసిడ్స్, పంచదార తదితరాలు ఖరీదు చేశారు. ఈ రసాయనాలతో విస్ఫోటనం ఎలా సృష్టించాలో వివరించే యూ ట్యూబ్‌ లింకుల్ని షేర్‌ చేశారు. దర్భంగ ఎక్స్‌ప్రెస్‌లో పంపాల్సిన పార్శిల్‌ ఉంచాల్సిన ‘బాటిల్‌ బాంబు’ తయారీపై ఇక్బాల్‌ ఈ అన్నదమ్ములకు సూచనలు చేస్తూనే ఉన్నాడు. ఓ టానిక్‌ సీసాలో ఈ మూడింటినీ నేర్పుగా, వేర్వేరుగా ఏర్పాటు చేయించాడు. 

సిడ్స్‌ను వేరు చేయడానికి మందంగా మడతపెట్టిన న్యూస్‌ పేపర్‌ వాడాలంటూ ఇక్బాల్‌ స్పష్టం చేశాడు. పంచదార కరిగి రసాయనాల్లో కలవడానికి చిన్న సిరంజీతో నీళ్లు ఉంచి చుక్కలు పడేలా ఏర్పాటు చేయాలని సూచించాడు. ‘బాటిల్‌’ను సిద్ధం చేస్తున్న ఇమ్రాన్, నాసిర్‌లు ఎన్నిసార్లు ప్రయత్నించినా న్యూస్‌ పేపర్‌ ఏర్పాటు చేయడం సాధ్యం కాలేదు. దీంతో మందమైన అట్ట ముక్కను వినియోగించి యాసిడ్స్‌ను వేరు చేశారు. దీన్ని వ్రస్తాల పార్శిల్‌ మధ్యలో పెట్టారు. 

దీంతో ఆ అట్టముక్క పూర్తిగా కరిగి రెండు యాసిడ్స్‌ కలవడానికి ఎక్కువ సమయం పట్టింది. ఫలితంగా రైలు నడుస్తుండగా కాజీపేట– రామగుండం స్టేషన్ల మధ్య జరగాల్సిన విస్ఫోటనం దర్భంగ స్టేషన్‌లో పార్శిల్‌ దింపిన తర్వాత చోటు చేసుకుంది. క్రైమ్‌ సీన్‌ రీ–కన్‌స్ట్రక్షన్‌ కోసం ఎన్‌ఐఏ అధికారులు నగరంలో అరెస్టు చేసిన ఇద్దరు ఉగ్రవాదులను సోమవారం ఇక్కడకు తీసుకువచ్చారు.    

మరిన్ని వార్తలు