గవర్నర్‌ ఎట్‌ హోంకు సీఎం గైర్హాజరు

27 Jan, 2023 00:56 IST|Sakshi
ఎట్‌హోం కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసైతో హైకోర్టు సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ దంపతులు, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, తమిళనాడు మాజీ గవర్నర్‌ రామ్మోహన్‌రావు 

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నేతలూ దూరంగానే

పెద్ద సంఖ్యలో హాజరైన బీజేపీ నేతలు

వేడుకల్లో ఎస్‌ఓపీ పాటించలేదని కేంద్రానికి నివేదిక

మీడియాతో ధ్రువీకరించిన గవర్నర్‌ తమిళిసై 

సాక్షి, హైదరాబాద్‌: దేశ గణతంత్ర దినోత్సవం నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌(ఎస్‌ఓపీ) పాటించలేదని కేంద్ర ప్రభుత్వా నికి నివేదిక పంపించినట్టు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వెల్లడించారు. గణతంత్ర దినోత్స వం సందర్భంగా గురువారం సాయంత్రం ఆమె రాజ్‌భవన్‌ ప్రాంగణంలో ఎట్‌ హోం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు.

ఎస్‌ఓపీ పాటించలేదన్న అంశంపై కేంద్రానికి నివేదిక పంపించారా? అని విలేకరులు ప్రశ్నించగా, పంపించినట్టు ఆమె ధ్రువీకరించారు. తేనేటి విందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలేవరూ హాజ రు కాలేదు. గతేడాది రాజ్‌భవన్‌ తేనేటి విందుకు హాజరైన రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఈసారి పూర్తిగా దూరంగా ఉన్నారు.

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్, మాజీ గవర్నర్‌ సీ.హెచ్‌.విద్యాసాగర్‌ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఆ పార్టీ నేతలు కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, ఎన్‌.రామచంద్రరావు, వివేక్, కపిలవాయి దిలీప్‌కు మార్, బాబు మోహన్, పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, యెండల లక్ష్మీనారాయణతో పాటు వివిధ రంగాల ప్రముఖులు, తెలంగాణ సాయుధ పోరాట యోధు లు పాల్గొన్నారు.

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అతిథులందరి వద్దకు వెళ్లి పేరు పేరునా పలకరించారు. కాగా, ఎట్‌ హోమ్‌ కార్యక్రమంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు ట్విట్టర్‌లో వ్యంగాస్త్రాలు సంధించారు. ‘ఎట్‌ హోం కార్యక్రమం బీజేపీ కా ర్యాలయంలా అయింది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షురాలు తమిళిసైతోపాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ నాయకులు హాజరయ్యారు’ అని ఎద్దేవా చేశారు. 

మరిన్ని వార్తలు