అటవీశాఖకు ప్రభుత్వ భూములు కేటాయింపు 

25 Dec, 2022 01:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వివిధ పనుల నిమిత్తం అటవీశాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న భూములకు అంతేమొత్తంగా నష్టపరిహారం కింద మరొకచోట భూములను కేటాయించేందుకు బీఆర్‌ఎస్‌ సర్కార్‌ నిర్ణయించింది. ఈ మేరకు కాంపన్సేటరీ అఫారెస్టేషన్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ప్లానింగ్‌ అథారిటీ (కంపా) వివిధ జిల్లాల్లోని గ్రామాల పరిధిలో కొన్ని సర్వే నంబర్లలోని భూములను రిజర్వు చేసింది.

దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. వీటిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డివిజన్‌లోని భూముల్లంక గ్రామంలో 314 ఎకరాలు, మండలం పరిధిలోని జంగాలపల్లి గ్రామంలో జంగాలపల్లి రిజర్వు ఫారెస్ట్‌ కోసం 284 ఎకరాలు, హనుమకొండ జిల్లా, డివిజన్‌లోని ముల్కనూరు, ముత్తారం గ్రామాల పరిధిలో 124 ఎకరాలను రిజర్వు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డివిజన్‌లోని చినబండిరేవు గ్రామం, 92 ఎకరాలు రిజర్వు చేశారు. మరికొన్ని జిల్లాల పరిధిలోనూ రిజర్వు అటవీప్రాంతం నిమిత్తం భూములను కేటాయిస్తూ అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.   

మరిన్ని వార్తలు