రాష్ట్రానికి విచ్చేసిన బీఆర్‌ఎస్‌ అతిథులు

18 Jan, 2023 02:28 IST|Sakshi
కేజ్రీవాల్‌కు స్వాగతం పలుకుతున్న మహమూద్‌ అలీ. చిత్రంలో  భగవంత్‌సింగ్‌ మాన్‌ ∙విజయన్‌కు పుష్పగుచ్ఛం ఇస్తున్న ప్రశాంత్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొనడానికి బీఆర్‌ఎస్‌ ఆహ్వానించిన ప్రముఖులు మంగళవారం రాత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు. వారికి మంత్రులు ఘనస్వాగతం పలికారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్‌ మాన్‌కు రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు ఇచ్చి, శాలువాతో సత్కరించారు. కాగా ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ స్వాగతించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆహ్వానించారు. 

సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా కూడా..
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌ పాషా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటీ నరసింహ, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రవీంద్ర చారి, పర్వతాలు, స్టాలిన్‌ తదితరులు స్వాగతం పలికారు.

కంటి వెలుగు కోసమే వచ్చా: కేజ్రీవాల్‌ 
తాను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొనడానికి మాత్రమే వచ్చానని, ఈ పర్యటనలో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. ఇది ఒక అధికారిక కార్య­క్రమ­మని ఆయన పేర్కొన్నారు. మంగళవా­రం హైద­రా­బాద్‌ వచ్చిన కేజ్రీవాల్‌ను ఆమ్‌ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యులు ఇందిరా శోభన్, డాక్టర్‌ దిడ్డి సుధాకర్, శోభన్‌ బాబు భూ­క్య, బుర్ర రాము గౌడ్, డాక్టర్‌ అన్సారీ కలిశారు.  

మరిన్ని వార్తలు