కేసీఆర్‌కు ఈ చాంబర్‌ ఏంటి?

9 Feb, 2024 01:52 IST|Sakshi

ప్రతిపక్ష నేత చాంబర్‌ కేటాయింపుపై రగడ 

కేసీఆర్‌కు ఔటర్‌ లాబీలో ఇరుకైన గది

స్పీకర్‌కు బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు.. వచ్చే

సమావేశాల్లోగా పరిష్కరిస్తామని హామీ

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ ఇన్నర్‌ లాబీలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఏళ్ల తరబడి కేటాయిస్తూ వస్తున్న చాంబర్‌ను తొలగించి తాజాగా కె.చంద్రశేఖరరావుకు ఔటర్‌ లాబీలో ఇరుకైన చిన్న గదిని కేటాయించడంపై బీఆర్‌ఎస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. శాసనసభ సమావేశాల తొలిరోజున గురువారం గవర్నర్‌ ప్రసంగం ముగిసిన తర్వాత బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్‌ చాంబర్‌కు వెళ్లి తమ నిరసన తెలిపారు.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు, హరీశ్‌రావు, సీనియర్‌ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి తదితరులు కేసీఆర్‌ చాంబర్‌ను మార్చడాన్ని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ దృష్టికి తీసుకెళ్లారు. 39 మంది ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ప్రధాన ప్రతిపక్షం నేత కార్యాలయాన్ని ఇన్నర్‌ లాబీ నుంచి ఔటర్‌ లాబీకి మార్చడాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాలం నుంచీ ఇన్నర్‌ లాబీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ప్రత్యేక చాంబర్‌ను కేటాయించడం ఆనవాయితీగా వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేతకు కేటాయించిన చాంబర్‌ను ఔటర్‌ లాబీకి తరలించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ప్రొటోకాల్‌ ఉల్లంఘనలపైనా ఫిర్యాదు 
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హక్కులను కాలరాసేలా కాంగ్రెస్‌ నేతలు వ్యవహరిస్తూ నియోజకవర్గాల్లో ప్రొటోకాల్‌ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. ప్రొటోకాల్‌ ఉల్లంఘనలకు సంబంధించిన పలు సంఘటలను కూడా స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ అనారోగ్యంతో బాధపడుతున్నా ఓటమి పాలైన కాంగ్రెస్‌ అభ్యర్థి జగ్గారెడ్డి భార్య వచ్చేంత వరకు సుమారు రెండు గంటల పాటు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు నిలిపివేశారన్నారు. నర్సాపూర్, దుబ్బాక, జహీరాబాద్‌ తదితర నియోజకవర్గాల్లోనూ ప్రొటోకాల్‌ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఓటమి పాలైన కాంగ్రెస్‌ అభ్యర్థులను పోలీసులు ఎస్కార్ట్‌ వాహనంతో అనుసరిస్తున్నారని స్పీకర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ప్రొటోకాల్‌ ఉల్లంఘనలు జరగకుండా అధికారులను ఆదేశించాలని స్పీకర్‌ను కోరారు.

పని చేయని టీవీ.. డోర్‌ హ్యాండిల్‌ లేని బాత్‌ రూం 
గతంలో ఐదుగురు సభ్యులున్న కాంగ్రెస్‌కు కూడా చాంబర్‌ను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇన్నర్‌ చాంబర్‌లోని ప్రతిపక్ష నేత చాంబర్‌ను తాను వాడుకుంటానని స్పీకర్‌ కోరడంతో ఔటర్‌ లాబీకి తన కార్యాలయాన్ని తరలించేందుకు కేసీఆర్‌ సుముఖత వ్యక్తం చేశారన్నారు. అయితే ఔటర్‌ లాబీలో ఇరుకైన చిన్న గది కేటాయించారని, అందులోని మూత్రశాలకు కనీసం డోర్‌ హ్యాండిల్‌ లేదనీ, టీవీ పనిచేయడం లేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు తెలిపారు. ఇది ప్రతిపక్ష నేతను అవమానించడం లాంటిదేనని, విశాలమైన చాంబర్‌ను కేటాయించాలని కోరారు. వచ్చే సెషన్‌లోగా ప్రతిపక్ష నేత చాంబర్‌ను విశాలంగా తీర్చిదిద్ది అన్ని వసతులు కల్పిస్తామని స్పీకర్‌ హామీ ఇచ్చారు.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega