రోడ్లపై బీఆర్‌ఎస్‌ వంటావార్పు

3 Mar, 2023 03:34 IST|Sakshi

గ్యాస్‌ సిలిండర్‌ ధరల పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు 

అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇతర నేతల నిరసన కార్యక్రమాలు 

సాక్షి, హైదరాబాద్‌: వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.50 పెంచుతూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో అధికార బీఆర్‌ఎస్‌ భారీఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపుమేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్‌పర్సన్లు, మేయర్లతోపాటు అన్ని స్థాయిల నాయకులు జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు జరిపారు.

రోడ్లపై కట్టెల పొయ్యితో వంటావార్పు, సిలిండర్లకు మోదీ ఫొటోలు అతికించి ఊరేగించడం, హైవేలపై ధర్నాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, మంత్రి మల్లారెడ్డితో కలిసి ఘట్‌కేసర్‌లో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. దేశ ప్రజలను పీడించే పార్టీగా బీజేపీని అభివర్ణించారు. కరీంనగర్‌లో తెలంగాణ చౌక్‌ వద్ద పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఆధ్వర్యంలో రోడ్లపై కట్టెల పొయ్యిలపై వంటావార్పు నిర్వహించి భోజనాలు చేశారు.

సికింద్రాబాద్‌లోని ఎంజీ రోడ్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ నేతృత్వంలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. మహబూబ్‌నగర్‌లో తెలంగాణ చౌరస్తా వద్ద నిర్వహించిన ఆందోళనలో మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ నల్లదుస్తులు ధరించి పాల్గొన్నారు. హైదరాబాద్‌ మీర్‌పేటలో జరిగిన నిరసన ప్రదర్శనలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.

నిజామాబాద్‌లో పాత కలెక్టరేట్‌ వద్ద ధర్నా చౌక్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా, మేయర్‌ నీతూ కిరణ్, జడ్పీ చైర్మన్‌ విఠల్‌ రావు తదితరులు పాల్గొన్నారు. మెదక్‌ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. సంగారెడ్డిలో టీఎస్‌ఎంఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌ తదితరులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

మరిన్ని వార్తలు