Hyderabad: ప్రాణం తీసిన ప్రేమ పెళ్లి! 

4 Jul, 2022 11:16 IST|Sakshi

కేపీహెచ్‌బీలో గత నెల 27న అదృశ్యమైన ప్రైవేటు ఉద్యోగి 

జిన్నారం అటవీ ప్రాంతంలో సగానికి పైగా కాలిపోయిన స్థితిలో శవం 

మద్యం తాగించి, గొంతు నులిమి చంపిన యువతి బంధువు! 

అటవీ ప్రాంతంలో పెట్రోల్‌ పోసి దహనం

సహకరించిన కారు డ్రైవర్‌..అంతా ఏపీలోని పొదల కొండపల్లికి చెందినవారే..  

నలుగురిపై కేసు నమోదు.. అదుపులో ఒకరు 

జిన్నారం/పటాన్‌చెరు టౌన్‌/కేపీహెచ్‌బీ (హైదరాబాద్‌): హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అదృశ్యమైన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు అతనిపై పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. సగానికి పైగా కాలిన స్థితిలో ఉన్న శవాన్ని పోలీసులు ఆదివారం కనుగొన్నారు. ప్రేమ వివాహమే ఈ ఘోరానికి కారణంగా తెలుస్తోంది. మాట్లాడుకుందాం రమ్మంటూ యువకుడిని పిలిచిన యువతి బంధువు ఫుల్లుగా మద్యం తాగించి, మరొకరి సహకారంతో గొంతు నులిమి హత్య చేసి శివారు అటవీ ప్రాంతంలో పెట్రోల్‌ పోసి దహనం చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మొత్తం నలుగురిపై కేసులు నమోదు చేశారు.  

కారు డ్రైవర్‌ ఇచ్చిన సమాచారంతో.. 
కేపీహెచ్‌బీ, జిన్నారం సీఐలు కిషన్‌కుమార్, వేణు కుమార్‌ తెలిపిన  వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని ప్రకాశం జిల్లా పొదల కొండపల్లికి చెందిన శనివారపు బాలిరెడ్డి కుమారుడు నారాయణ రెడ్డి (25) ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తూ కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నంబర్‌ ఒకటిలోని ఓ ఇంట్లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. గత నెల 27న రాత్రి 9 గంటల సమయంలో తాను శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తిని కలిసేందుకు వెళుతున్నట్లు చెప్పి బయటకు వెళ్లిన నారాయణరెడ్డి తిరిగిరాలేదు.

ఫోన్‌ కూడా స్విచ్‌ ఆఫ్‌ అయ్యింది. దీంతో అతని స్నేహితులు నారాయణరెడ్డి బావ వెంకటేశ్వరరెడ్డికి సమాచారం అందించారు. ఆయన గత నెల 30న కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదృశ్యం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు శ్రీనివాస్‌రెడ్డితో పాటు అతని గ్రామానికే చెందిన కారు డ్రైవర్‌ షేక్‌ ఆషిక్‌లపై నిఘా పెట్టారు.

తర్వాత ఆషిక్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా నారాయణ రెడ్డిని హత్య చేసి సంగారెడ్డి జిల్లా జిన్నారం అటవీ ప్రాంతంలో పెట్రోల్‌ పోసి దహనం చేసినట్లుగా గుర్తించారు. వెంటనే 80 శాతం దహనమైన స్థితిలో ఉన్న నారాయణ రెడ్డి శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవ పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి హత్య కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.  

పెళ్లిని అంగీకరించని యువతి కుటుంబీకులు 
నారాయణరెడ్డి ఏడాది కిందట తన స్వగ్రామానికే చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే యువతి కుటుంబీకులు వారి వివాహాన్ని అంగీకరించకపోగా యువతిని ఇంటికి తీసుకెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆమె తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. అయినా ఇద్దరూ మాట్లాడుకుంటున్నారనే అనుమానంతో యువతి కుటుంబీకులు నారాయణ రెడ్డిని అంతమొందించేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో నారాయణ రెడ్డిని అతని గది నుంచి బయటకు రప్పించిన పొదల కొండపల్లికే చెందిన యువతి బంధువు శ్రీనివాస్‌ రెడ్డి.. ఆషిక్‌ కారులో రాయదుర్గం తీసుకెళ్లాడు. అక్కడ అతనికి మద్యం తాగించి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం శవాన్ని మాయం చేసేందుకు జిన్నారం ప్రాంతంలో పెట్రోల్‌ పోసి తగలబెట్టినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆషిక్, శ్రీనివాస్‌రెడ్డితో పాటు హత్యోదంతంలో పాల్గొన్న మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. యువతి కుటుంబసభ్యులు మరికొందరి ప్రమేయం పైనా, సుపారీ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  

ఇది కూడా చదవండి: బీజేపీ సభ: సోమవారం ఉదయం వరకు ఆ రోడ్డు మూసివేత

మరిన్ని వార్తలు