పోలీసు నియామకాల నిబంధనలను మార్చాల్సిందే  

20 Dec, 2022 02:40 IST|Sakshi

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌    

సాక్షి, హైదరాబాద్‌: ఎస్‌ఐ, పోలీసు కానిస్టేబుల్‌ నియామకాల్లో ఉన్న నియమ నిబంధనలను మార్చాలని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. మూడు ఈవెంట్స్‌ తప్పనిసరి చేయడంపై పునరాలోచించాలని, ఎత్తును మాన్యువల్‌గా కొలవాలని, షాట్‌పుట్‌ లైన్‌ మీద పడినా క్యాలిఫై చేయాలని కోరారు. సోమవారం బీఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఈసారి పరుగు పందెంలో పురుషులకు 1,600 మీటర్లు, అమ్మాయిలకు 800 మీటర్లు పెట్టడం నిరుద్యోగులను ఇబ్బందులకు గురిచేయడమనే అన్నారు.

లాంగ్‌జంప్‌ 3.8 మీటర్లు పరిగణనలోకి తీసుకోవాలని, ఎత్తు కొలిచే సందర్భంలోనూ సాంకేతిక లోపంతో చాలా మంది అభ్యర్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎత్తును మ్యానువల్‌గా కొలవాలని కోరారు. చాలా గ్రామాల్లో సరైన గ్రౌండ్స్‌ లేవని, పీఈటీ కూడాలేని పరిస్థితుల్లో మూడు ఈవెంట్స్‌ తప్పనిసరి చేయడం సరికాదని, ఎక్కువ మంది హాజరు కాకూడదనే కుట్రపూరితంగా ఇలా చేస్తున్నారని ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు. ప్రతి ఏడాది నోటిఫికేషన్‌ ఇవ్వకుండా ఎన్నికల సమయంలో ఉద్యోగాలంటూ అభ్యర్థులను ఆందోళనలకు గురి చేయడం ఏమిటని నిలదీశారు. నిబంధనలను మార్చకపోతే బీఎస్పీ నిరవధిక పోరాటం చేస్తుందని హెచ్చరించారు.   

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు