ఓట్లు పేదలవి.. కోట్లు పాలకులవి: ఆర్‌ఎస్పీ 

9 May, 2022 01:11 IST|Sakshi
ఖమ్మం పాడులో మాట్లాడుతున్న ప్రవీణ్‌కుమార్‌ 

అశ్వారావుపేట రూరల్‌: పేదల ఓట్లతో గద్దెనెక్కిన పాలకులు కోట్ల రూపాయలు దండుకుంటున్నారని, ప్రజలు మాత్రం అక్కడే ఉన్నారని బీఎస్పీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు. ఆయన చేపట్టిన రాజ్యాధికార యాత్ర ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం, ఆసుపాక, నారాయణపురం, నందిపాడు, ఖమ్మంపాడు, బచ్చువారిగూడెం, దురదపాడు, తిరుమలకుంట గ్రామాల్లో కొనసాగింది.

ఈ సందర్భంగా ప్రవీణ్‌ మాట్లాడుతూ ఏళ్లుగా పేదలను మోసం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్‌లను ఇంటికి పంపించి, బహుజన రాజ్యం కోసం బీఎస్పీని అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు. మండలంలోని గుమ్మడవల్లి గ్రామం వద్ద 40 ఏళ్ల క్రితం నిర్మించిన పెదవాగు ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు నేటికీ నష్ట పరిహారం ఇవ్వకపోవడం పాలకుల అసమర్థతకు నిదర్శమని మండిపడ్డారు. కార్యక్రమంలో రిటైర్డ్‌ డీఐజీ కోటేశ్వరరావు, జిల్లా ఇన్‌చార్జి కృష్ణార్జునరావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు