రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే జరపాలి

30 Aug, 2021 01:57 IST|Sakshi

బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ ప్రవీణ్‌ కుమార్‌

లక్డీకాపూల్‌ (హైదరాబాద్‌): రాష్ట్రప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే జరిపించాలని బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర సమన్వయకర్త ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. గ్రామాల్లో ప్రజలకు గణన విషయాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ జనగణనకు ఏర్పాటు చేసిన ఐక్య సదస్సు రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌ డేటా తన దగ్గర ఉంచుకుని కులం ఓట్లను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో ఎస్సీ, బీసీ కులాలకు చెందిన అధికారులను ఎంతమందిని పెట్టుకున్నారో పరిశీలిస్తే.. ప్రభుత్వ వైఖరి తేటతెల్లమవుతుందన్నారు. చివరికి కాళేశ్వరంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన కాంట్రాక్టర్లు ఎవ్వరూ లేరని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రవీణ్‌ కుమార్‌ అంటే అందరి వాడని, కొందరి వాడు కాదన్నారు. గ్రామాల్లో ప్రతి ఫంక్షన్లలో జనాభా గణన గురించే మాట్లాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో బీసీ జన గణన కోసం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో విశ్వేశ్వరరావు, కాంగ్రెస్‌ నాయకులు అనిల్, శారద, కృçష్ణుడు, రియాజ్, నాగరాజు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు