ఎమ్మెస్‌.. టైమ్‌ పాస్‌!

26 Jan, 2024 05:12 IST|Sakshi

ఉద్యోగాలు దొరక్క విదేశీ చదువులపైబీటెక్‌ గ్రాడ్యుయేట్ల చూపు

ఐటీ సెక్టార్‌పై ఆర్థిక మాంద్యం ప్రభావం..

కొన్ని కంపెనీలు ఆఫర్‌ లెటర్లు ఇచ్చినాఅపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇవ్వని వైనం

ఖాళీగా ఉండటం ఇష్టం లేక విదేశాల్లోఎమ్మెస్‌పై దృష్టి.. అప్పోసొప్పో చేసిఅమెరికా లాంటి దేశాలకు పయనం

చదువుకుంటూ పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేసుకోవచ్చనే ఆలోచన

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక మాంద్యం ఐటీ రంగాన్ని కుదిపివేస్తున్న నేపథ్యంలో భారతీయ విద్యార్థులు విదేశీ చదువులపై దృష్టి పెట్టారు. సాఫ్ట్‌వేర్‌ రంగం గాడిన పడే వరకూ ఎంఎస్‌ చేయడమే మేలని భావిస్తున్నారు. ఈ కారణంగా ఈ ఏడాది విదేశీ విద్యకు వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగింది. కరోనా నేపథ్యంలో 2021 విద్యా సంవత్సరంలో 4.44 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తే, 2022లో ఈ సంఖ్య ఏకంగా 6.84 లక్షలకు పెరిగింది.

2023 చివరి నాటికి ఈ సంఖ్య మరో 10 వేల వరకు పెరిగిందని అంచనా. అమెరికా వంటి దేశాల్లో ఐటీ సెక్టార్‌ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని తెలిసినా.. ఈ ఒక్క దేశానికే 2023లో 2.80 లక్షల మంది భారతీయులు విద్య కోసం వెళ్ళారు. మరోవైపు కెనడా వీసా ఆంక్షలకు నిబంధనలు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు వార్తలొస్తున్నా, చదువు కోసం వెళ్ళేందుకే విద్యార్థులు ఇష్టపడుతున్నారు. 

ఎందుకీ పరిస్థితి..?
దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 12 లక్షల మంది ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు మార్కెట్లోకి వస్తున్నారు. వీరిలో కేవలం 8 శాతం మందికి మాత్రమే నైపుణ్యం ఉన్నట్టు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నారు. బహుళజాతి కంపెనీల్లో మంచి వేతనంతో ఉద్యోగాలు పొందుతున్నది వీళ్ళే. మిగతా వాళ్ళు వచ్చిన ఉద్యోగంతో సంతృప్తి పడుతున్నారు. సివిల్‌ ఇంజనీరింగ్‌ చేసిన వాళ్ళు కూడా ఏదో ఒక సాఫ్ట్‌వేర్‌ కోర్సు నేర్చుకుని సంబంధం లేని ఉద్యోగానికి వెళ్తున్నారు. ఇంతకాలం వీళ్ళ అవసరం ఉండేది. అవసరమైన శిక్షణ ఇచ్చి కంపెనీలు వారి సేవలను వినియోగించుకునేవి.

కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. అమెరికాలో వచ్చిన ఆర్థిక సంక్షోభం ప్రభావం భారత్‌ ఐటీ రంగంపైనా ప్రభావం చూపించింది. ప్రధాన కంపెనీలన్నీ వరుసగా లే ఆఫ్‌లు ప్రకటించడంతో ఐటీ విభాగం కుదేలైంది. క్యాంపస్‌ నియామకాలు తగ్గాయి. కొన్ని కంపెనీలు ఆఫర్‌ లెటర్లు ఇచ్చినా ఉద్యోగాలుమాత్రం ఇవ్వలేదు. దీంతో బీటెక్‌ పూర్తి చేసిన విద్యార్థులు ఆఫ్‌ క్యాంపస్‌ ఉద్యోగాలు వెతుక్కోవాల్సి వస్తోంది. పోటీ తీవ్రంగా ఉండటంతో ఫ్రెషర్స్‌ పోటీని తట్టుకుని నిలబడటం కష్టంగా ఉంది.  ఈ కారణంగానే విదేశాల్లో విద్యాభ్యాసానికి వెళుతున్నారు.

సమయం వృథా ఎందుకుని..
చాలా కంపెనీలు ఏడాది క్రితం ఫ్రెష్‌ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌కు ఆఫర్‌ లెటర్స్‌ ఇచ్చాయి. కానీ చాలా సంస్థలు ఇంత వరకూ నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. నాస్కామ్‌ తాజాగా జరిపిన ఓ సర్వేలో ఇలాంటి వాళ్ళు భారత్‌లో 2.5 లక్షలు ఉంటారని తేలింది. మన రాష్ట్రంలోనే 24 వేల మందికి పైగా ఉన్నట్టు స్పష్టమైంది.

మరో  వైపు అమెరికా ప్రాజెక్టులు తగ్గుతున్నా యని కంపెనీలు చెబుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో నియామక ఉత్తర్వులు వస్తాయన్న భరోసా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉండటం దేనికి? అని యువత భావిస్తోంది. ఒకవేళ ఖాళీగా ఉంటే ఆ తర్వాత జాబ్‌లోకి తీసుకోవడానికి కంపెనీలు అంతగా ఆసక్తి చూపవు. దీన్ని దృష్టిలో ఉంచుకునే పరిస్థితి చక్కబడే వరకూ ఎమ్మెస్‌ లాంటిది చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

లభించని బ్యాంకు రుణాలు
విదేశీ విద్యకు గతంలో తేలికగా రుణాలు లభించేవి. కానీ గత ఏడాది కాలంగా బ్యాంకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదనిన విద్యార్థులు అంటున్నారు. బ్యాంకు రుణాల విధానాన్ని సవరించడమే దీనికి కారణమని బ్యాంకర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్ళేందుకు అవసరమైన సెక్యూరిటీ మొత్తం, అక్కడి ఖర్చుల కోసం ఒక్కో విద్యార్థి కనీసం రూ.40 లక్షల వరకూ అప్పు చేస్తున్నారు.

ఈ మొత్తాన్ని విదేశాల్లో చదివేటప్పుడు తీర్చేద్దామన్న ధీమాతో వెళ్తున్నారు. విదేశాల్లో ఏదైనా పార్ట్‌టైం జాబ్‌ చేయొచ్చనేది వారి ఆలోచన. కానీ గతేడాది డిసెంబర్‌లో వెళ్ళిన విద్యార్థులకు అమెరికాలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. పార్ట్‌ టైం ఉద్యోగాలు దొరకడం కూడా కష్టంగా ఉందని అక్కడి విద్యార్థులు చెబుతుండటం గమనార్హం. 

ఐటీ కోలుకోవడంపైనే ఆశలు
బీటెక్‌ పూర్తయ్యాక ఇండియాలో ఏడాది పాటు ఉద్యోగం కోసంవిఫల ప్రయత్నం చేశా. చివరకు అమెరికా వెళ్ళి ఎమ్మెస్‌ చేయాలని నిర్ణయించుకున్నా. ఇంట్లో అర ఎకరం పొలం అమ్మి డబ్బులిచ్చారు. నేను కొంత అప్పు చేశా. డిసెంబర్‌లో అమెరికా వచ్చా. ఇక్కడ పార్ట్‌ టైం జాబ్‌ కష్టమని కన్సల్టెన్సీలు చెబుతున్నాయి. మళ్ళీ అప్పు చేయమని తల్లిదండ్రులకు చెప్పడం ఇబ్బందిగానేఉంది. ఐటీ కోలుకుంటే పరిస్థితి మారుతుందనే నమ్మకం ఉంది. –శశాంక్‌ (అమెరికా వెళ్ళిన వరంగల్‌ విద్యార్థి)

ఏడాది క్రితం ఆఫర్‌ లెటర్‌ ఇచ్చారు
బీటెక్‌ అవ్వగానే ఆఫ్‌ క్యాంపస్‌లో ఓ కంపెనీ ఉద్యోగం ఆఫర్‌ చేసింది. ఉద్యోగం వచ్చిందని నేను, మా వాళ్ళూ బంధువులందరికీ చెప్పుకున్నాం. ఆ లెటర్‌ పట్టుకుని ఏడాది నిరీక్షించా. ఎంతకీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ రాలేదు. ఇప్పుడు చిన్నతనంగా ఉంది. అందుకే అప్పు చేసి మరీ అమెరికా వెళ్ళేందుకు సిద్ధమవుతున్నా. ఎమ్మెస్‌ అయిపోయే లోగా పరిస్థితి మారుతుందనే ఆశ ఉంది.– పి. నీలేశ్‌ కుమార్‌ (యూఎస్‌ వెళ్ళేందుకు సిద్ధమైన హైదరాబాద్‌ విద్యార్థి)

whatsapp channel

మరిన్ని వార్తలు