బ‘కిల్స్‌’! సీటు బెల్ట్‌, అలారం పనిచేయకుండా ఆపే సాంకేతికత...

26 Jul, 2022 07:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రహదారులపై జరిగే కారు ప్రమాదాలు, వాటిలో మృతుల సంఖ్యను తగ్గించడానికి ఆయా కంపెనీలు అనునిత్యం అధ్యయనాలు చేస్తున్నాయి. వీళ్లు ప్రవేశపెట్టిన సేఫ్టీ ఫీచర్స్‌కు ‘విరుగుడు’ తయారు చేసే వాళ్లూ ఎక్కువైపోతున్నాయి. కారు ప్రమాదాల తీవ్రత, మృతులను తగ్గించడానికి ఉపకరించే సీట్‌ బెల్డ్‌ అలారం ఆపే బకెల్స్‌ సైతం ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.

కార్‌ డెకార్స్‌ దుకాణాలతో పాటు ఆన్‌లైన్‌లో వీటిని విక్రయించేస్తున్నారు. ఫలితంగా సీట్‌ బెల్ట్‌ స్ఫూర్తి దెబ్బతింటోందని, భద్రతా చర్యలన్నీ వాహనచోదకుల కోసమే అన్నది గుర్తుపెట్టుకోవాలని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు కోరుతున్నారు. ఏటా దేశంలో చోటు చేసుకుంటున్న కార్లు వంటి తేలికపాటి వాహనాలకు సంబంధించిన ప్రమాదాల్లో 60 శాతం మంది సీటుబెల్ట్‌ వాడని కారణంగానే మృత్యువాతపడుతున్నారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.  


 
ప్రాణదాత సీట్‌బెల్ట్‌.. 

  • కారులో ఉన్న ప్రయాణికులు కూర్చుని ఉన్నప్పటికీ.. వాహనంతో పాటు అదే వేగంతో ముందుకు వెళ్తున్నట్లే లెక్క. అలా వెళ్తున్న వాహనం దేన్నైనా గుద్దుకున్నా.. హఠాత్తుగా వేగాన్ని కోల్పోయినా.. అందులో ప్రయాణిస్తున్న వారు మాత్రం అదే వేగంతో ముందుకు వెళ్తారు.  
  • ఫలితంగా డ్యాష్‌ బోర్డ్స్‌ (ముందు సీట్లో వారు), ముందు సీట్లు (వెనుక కూర్చున్న వారు) తదితరాలను అత్యంత వేగంగా ఢీకొడతారు. ఒక్కోసారి వాహనం పల్టీలు కొడితే అద్దాల్లోంచి, డోర్‌ ఊడిపోయి అందులోంచి బయటకు వచ్చి పడిపోతారు. ఫలితంగా మరణం సంభవించే ప్రమాదం ఉంటుంది.  
  • తేలికపాటి వాహనాల్లో ప్రయాణిస్తున్న వాళ్లు కచ్చితంగా సీట్‌బెల్ట్‌ వాడితే కేవలం పెద్ద ఎత్తున కుదుపు మాత్రమే ఉండి గాయాలతో బయటపడచ్చు. ప్రస్తుతం కేవలం కారు నడిపే వ్యక్తి మాత్రమే కచ్చితంగా సీటుబెల్ట్‌ ధరించేలా నిబంధనలు ఉన్నాయి. దీన్ని మిగిలిన వారికీ విస్తరించాల్సిన అవసరం ఉంది.  
  • మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి సహా నలుగురు ప్రయాణిస్తున్న కారు 2011 డిసెంబర్‌ 21న హైదరాబాద్‌ శివార్లలోని మెదక్‌ జిల్లా కొల్లూర్‌ వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్‌పై ప్రమాదానికి లోనైంది. ఆ సమయంలో కారు గంటకు 150 కిమీ వేగంతో ప్రయాణిస్తోంది. ఈ ప్రమాదంలో ప్రతీక్‌తో పాటు సుజిత్‌కుమార్, చంద్రారెడ్డి ఘటనాస్థలిలోనే మరణించారు. వెనుక సీట్లో కూర్చున్న ఆరవ్‌రెడ్డి సీట్‌ బెల్ట్‌ పెట్టుకోవడంతోనే మృత్యుంజయుడు అయ్యాడు. ఇలాగే అనేక ప్రమాదాల్లో ప్రయాణికులకు సీటుబెల్ట్‌ ప్రాణదాతగా నిలిచింది. 

అలారం వచ్చేలా టెక్నాలజీ.. 

  • ఇంతటి కీలకమైన సీట్‌బెల్ట్‌ కచ్చితంగా వాడేలా చేయడానికి కార్ల తయారీ కంపెనీలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. తొలినాళ్లలో కేవలం డ్రైవర్, ఇప్పుడు అతడితో పాటు ముందు సీట్లో పక్కన కూర్చున్న ప్రయాణికుడు దీన్ని ధరించకపోతే అలారం వచ్చేలా టెక్నాలజీ అభివృద్ధి చేశాయి. దీన్ని తప్పించుకోవడానికి అనేక మంది వాహనచోదకులు సీట్‌బెల్ట్‌ బకెల్‌ను దాని సాకెట్‌లో పెట్టి... బెల్ట్‌ను మాత్రం తమకు, సీటుకు మధ్య ఉంచుతున్నారు. ఇటీవల దీని కోసం సీట్‌ బెల్ట్‌ అలారం స్టాపర్‌ బకెల్స్‌ తయారు చేసి విక్రయిస్తున్నారు. దీన్ని సీట్‌బెల్ట్‌ బకెల్‌ స్లాట్‌లో ఉంచేస్తే చాలు... కనీసం వెనుక నుంచీ బెల్ట్‌ పెట్టుకోనక్కర్లేదు. 
  • ఈ బకెల్స్‌ను కార్‌ డెకార్స్‌ దుకాణాలు వివిధ రకాలైన బ్రాండ్ల పేరుతో విక్రయిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ఏ కంపెనీ కారు వినియోగిస్తుంటే ఆ కంపెనీ లోగోతో అమ్మే వర్తకులు పట్టుకు వచ్చాయి. ఇటీవల కాలంలో వీటి వినియోగం పెరిగిందని అధికారులే చెబుతున్నారు. వీటి ద్వారా అలారం మోగకుండా ఆపవచ్చు కానీ ప్రమాదం జరగకుండా కాదని ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు. సీట్‌బెల్ట్‌ అనేది వాహన చోదకుడి ప్రాణాలు రక్షిస్తుందనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. ఈ బకెల్స్‌ వినియోగంపై చర్యలకు యోచిస్తున్నామని చెబుతున్నారు.    

(చదవండి: బస్సులు పెంచుకుందాం.. ఆదాయం పంచుకుందాం!)

మరిన్ని వార్తలు