రైల్వేకు కేటాయింపుల్లో భారీగా తగ్గింపు

4 Feb, 2021 08:25 IST|Sakshi

పనులు కొనసాగుతున్న ప్రాజెక్టులకు అంతంత మాత్రమే నిధులు

డబ్లింగ్, ట్రిప్లింగ్‌ పనులపై చిన్నచూపు.. తీవ్రంగా కోవిడ్‌ ప్రభావం

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ ప్రభావం రైల్వేపై పడింది. గతేడాది కేంద్ర బడ్జెట్‌లో రైల్వేకు భారీగానే కేటాయింపులు జరిపిన కేంద్రం.. ఈసారి కొంత కోత పెట్టినట్టు కనిపిస్తోంది. రైల్వేకు సంబంధించిన కేటాయింపులను బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత వెబ్‌సైట్‌లో ఉంచారు. గతేడాది కంటే దాదాపు రూ.2 వేల కోట్ల మేర కేటాయింపుల్లో కోత పడ్డట్టు కనిపిస్తోంది. ప్రాజెక్టుల వారీగా పరిశీలించినా.. కేటాయింపులు కొన్నింటికే పరిమితమయ్యాయి. కోవిడ్‌ వల్ల ఎదురైన ఆర్థిక ఆటంకాలతో కేటాయింపులు కుంచించుకుపోయాయని అధికారులు పేర్కొంటున్నారు.

ఈ సంవత్సరం పనులను వేగంగా నిర్వహించి రెండు, మూడు ప్రాజెక్టులు అందుబా టులోకి తేవాలని నిర్ణయించినా, వాటికి తగ్గ నిధులు మాత్రం దక్కలేదు. దేశవ్యాప్తంగా 56 ప్రాజెక్టులను ప్రాధాన్యమైనవిగా నిర్ధారించి వచ్చే ఆర్థిక సంవత్సరంలోపు ప్రారంభించేలా చూడనున్నట్టు రైల్వే తాజాగా ప్రకటించింది. అందులో తెలంగాణకు సంబంధించి సికింద్రాబాద్‌–మహబూబ్‌నగర్‌ డబ్లింగ్, భద్రాచలం రోడ్‌–సత్తుపల్లి కొత్తలైన్లకు చోటు దక్కింది. కానీ ఈ రెండు ప్రాజెక్టులకు కూడా గత బడ్జెట్‌ కంటే నిధులు తక్కువే కేటాయించటం గమనార్హం. గత బడ్జెట్‌లో కొత్త లైన్లకు రూ.2,856 కోట్లు కేటాయిస్తే ఈసారి కేవలం రూ.205 కోట్లే దక్కాయి. డబ్లింగ్‌ పనులకు గతంతో పోలిస్తే రూ.3,836 కోట్లకు గాను కేవలం రూ.868 కోట్లే దక్కాయి.

ఆ ఊసే లేదు.. 
రాష్ట్రప్రభుత్వం–రైల్వే మధ్య సమన్వయం కొరవడి ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టు పనులు ముందుకు సాగని నేపథ్యంలో.. కొత్త బడ్జెట్‌లో దాని ఊసే లేదని తెలుస్తోంది. ఇప్పటికే రైల్వే శాఖ తన వాటాకు మించి నిధులు వెచ్చించింది. రాష్ట్ర ప్రభుత్వం భారీగా బకాయిపడింది. ఆ నిధులు వస్తే పనులు జరుపుతామని ఇప్పటికే పలుమార్లు రైల్వే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. కానీ ఇప్పటివరకు నిధులు రాకపోవటంతో ఈసారి బడ్జెట్‌లో ఆ ప్రాజెక్టును విస్మరించినట్టు కనిపిస్తోంది. ఇక కాజీపేట వ్యాగన్‌ ఓవర్‌ హాలింగ్‌ వర్క్‌షాపు విషయంలోనూ అదే జరిగింది.

దక్షిణ మధ్య రైల్వేకు కేటాయింపులు ఇలా.. 

పని తాజా బడ్జెట్ (అంకెలు రూ.కోట్లలో)  గత బడ్జెట్‌ (అంకెలు రూ.కోట్లలో)
కొత్త లైన్లకు 205  2,856
డబ్లింగ్‌ పనులకు 868.10  3,836
ట్రాఫిక్‌ వసతులకు 72.65 154
ఆర్‌ఓబీ/ఆర్‌యూబీల నిర్మాణం 562.86  584
ట్రాకుల పునరుద్ధరణ 862 900
ప్రయాణికుల వసతుల మెరుగుకు 199.49 672

ప్రధాన ప్రాజెక్టుల కేటాయింపులు ఇలా..  

మునీరాబాద్‌–మహబూబ్‌నగర్ 149 240
మనోహరాబాద్‌–కొత్తపల్లి 325 235
భద్రాచలం రోడ్‌–సత్తుపల్లి 267 520 
అక్కన్నపేట– మెదక్ 83.63 -

డబ్లింగ్‌ పనులు

కాజీపేట–విజయవాడ 300 404
కాజీపేట–బల్లార్షా 475 483
సికింద్రాబాద్‌–మహబూబ్‌నగర్ 100 185
విజయవాడ–కాజీపేట బైపాస్‌ 286 -
మంచిర్యాల–పెద్దంపేట ట్రిప్లింగ్ 4.50 -
చర్లపల్లి శాటిలైట్‌ టెర్మినల్‌ 50 5

అంతా గందరగోళం.. 
రైల్వేకు సంబంధించి బడ్జెట్‌ పింక్‌ బుక్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టాక వివరాలు అందిస్తారు. బుధవారం రాత్రి 8 వరకు కూడా ఆ సమాచారం అందకపోయేసరికి, గురువారమే వివరాలు వస్తాయని మీడియాకు వెల్లడించి అధికారులు ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ తర్వాత రాత్రి 9 సమయంలో బడ్జెట్‌ వివరాలను ఢిల్లీ నుంచి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. దీంతో వాటిని క్రోడీకరించే సమయం లేదని పేర్కొన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు వివరాలను గురువారమే వెల్లడించగలమని తేల్చి చెప్పారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు