పురపాలకానికి నిధుల వరద

19 Mar, 2021 08:24 IST|Sakshi

 బడ్జెట్లో రూ.14,112.24 కోట్ల కేటాయింపులు 

హైదరాబాద్‌కు భారీగా నిధులు 

వరంగల్‌కు రూ.250 కోట్లు.. ఖమ్మంకు రూ.150 కోట్లు 

స్మార్ట్‌ సిటీ, అమృత్‌ ప్రాజెక్టులకూ అధిక కేటాయింపులు  

సాక్షి, హైదరాబాద్‌: పురపాలక శాఖకు బడ్జెట్‌లో నిధుల వరద పారింది. 2020–21లో ఈ శాఖకు రూ.12,287.29 కోట్లు ఇవ్వగా.. ఈసారి (2021– 22లో) రూ.14,112.24 కోట్లకు పెంచారు. ఇందు లో నిర్వహణ పద్దు కింద కేటాయింపులు రూ.1,261.98 కోట్ల నుంచి రూ.3,978.01 కోట్లకు పెరగగా.. ప్రగతిపద్దు కేటాయింపులు రూ.11,020.31 కోట్ల నుంచి రూ.10,134.23 కోట్లకు తగ్గాయి. హైదరాబాద్‌ నగరానికి ఈసారి కూడా భారీగా కేటాయింపులు ఉన్నాయి.

నిర్వహణ పద్దు కింద జల మండలికి రుణాలను రూ.900 కోట్ల నుంచి రూ.738.52 కోట్లకు తగ్గించారు. అభివృద్ధి పనుల కోసం కొత్తగా రూ.668 కోట్లను కేటాయించారు. కృష్ణా డ్రింకింగ్‌ వాటర్‌ ప్రాజెక్టులో భాగంగా సుంకిశాల ఇంటేక్‌ నుంచి హైదరాబాద్‌కు నీటి సరఫరా చేసే పనుల కోసం రూ.725 కోట్ల రుణానికి ఓకే చెప్పారు. హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.వెయ్యి కోట్లు, ఓఆర్‌ఆర్‌ కోసం హెచ్‌ఎండీఏకు రూ.472 కోట్లు రుణాలుగా కేటాయించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటాగా స్మార్ట్‌సిటీలకు రూ.288.60 కోట్లు, అమృ త్‌ నగరాలకు రూ.203.02 కోట్లు కేటాయించారు. 

పట్టణాల్లో పనుల కోసం.. 
రాష్ట్ర పథకాల కింద మూసీ పరీవాహక ప్రాంత అభి వృద్ధికి రూ.200 కోట్లు, టీయూఎఫ్‌ఐడీసీకి రూ.219.33 కోట్లు, హైదరాబాద్‌ ప్రజలకు 20వేల లీటర్ల ఉచిత నీటిసరఫరా కోసం జలమండలికి రూ.250 కోట్లు, కొత్త ఎయిర్‌స్ట్రిప్‌లకు రూ.75.47 కోట్లు, వరంగల్‌ మెట్రో ప్రాజెక్టుకు రూ.150.94 కోట్లు, హైదరాబాద్‌ అర్బన్‌ అగ్లోమెరేషన్‌ పనులకు రూ.1,962.22 కోట్లు కేటాయించారు. 

యాదాద్రికి రూ.350 కోట్లు 
గత బడ్జెట్‌ తరహాలోనే యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ (వైటీడీఏ)కు రూ.350 కోట్లు, వేములవాడ ఆలయాభివృద్ధి సంస్థ (వైటీడీఏ)కు రూ.50 కోట్లు ఇచ్చారు. పదిలక్షలపైన జనాభా గల నగరాలకు ఫైనాన్స్‌ కమిషన్‌ గ్రాంట్ల కింద హైదరాబాద్‌ నగరానికి రూ.318 కోట్లు, ఇతర నగరాలకు రూ.354 కోట్లను ప్రతిపాదించారు.

స్వచ్ఛ భారత్‌కు భారీగా.. 
కేంద్ర ప్రాయోజిత పథకాల కింద స్వచ్ఛ భారత్‌కు రూ.783.75 కోట్లు, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై)కు రూ.166.50 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. మున్సిపాలిటీలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను రూ.889 కోట్ల నుంచి రూ.672 కోట్లకు తగ్గించారు. పురపాలికలకు ఆరోగ్య రంగం కింద ఫైనాన్స్‌ కమిషన్‌ గ్రాంట్లుగా రూ.107.51 కోట్లను కొత్తగా కేటాయించారు. మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లకు వడ్డీలేని రుణాల కింద నిధుల కేటాయింపులను రూ.226.41 కోట్ల నుంచి 566.02 కోట్లకు పెంచారు. 

మరిన్ని వార్తలు