Govt Schools: సర్కారీ స్కూళ్లలో ఇక ప్రతి బుధవారం బోధన ‘మామూలు’గా ఉండదు!

25 Jun, 2022 17:34 IST|Sakshi
బుధవారం బోధన కార్యక్రమం పోస్టర్‌

వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం

సాక్షి, భువనగిరి : సర్కారు పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా ప్రతి బుధవారం పాఠశాలల్లో ‘బోధన’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీనగర్‌ మండలం జమీలాపేట ప్రభుత్వ పాఠశాలలో ఈనెల 22న బోధన కార్యక్రమాన్ని కలెక్టర్‌  పమేలా సత్పతి ప్రారంభించారు. విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందించడంతో పాటు పఠనంలో దోషాలు నివారించడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.

బుధవారం బోధనలో ఇలా..
బుధవారం బోధనలో భాగంగా ఆ రోజు పాఠశాలల్లో హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా పలు కార్యక్రమాలు నిర్వహించాలి. విద్యార్థులను తరగతి గదిలో బిగ్గరగా చదివించడం, అక్షర దోషాలు లేకుండా రాయించడం, భాష దోషాలు లేకుండా, గణితంలో పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలి. కిచెన్‌గార్డెన్‌లో భాగంగా విద్యార్థులు పాఠశాల ఆవరణలో కూరగాయ మొక్కలు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తారు. 
చదవండి👉🏻Telangana: తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం

పర్యవేక్షణ అధికారులు వీరే..
బోధన కార్యక్రమాన్ని కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఈఓ, ఎంఈఓలు, ఎంపీడీఓలు, సెక్టోరియల్‌ అధికారులు, కాంప్లెక్స్‌ హెడ్‌మాస్టర్లు, జిల్లా, మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తారు. విద్యార్థులు బిగ్గరగా చదివే అభ్యాసాన్ని ప్రోత్సహిస్తారు. పఠనం మరియు సంఖ్యా గణనలో పురోగతి వయస్సుకు తగిన గణిత శాస్త్ర కార్యకలాపాలను చేయడంతో విద్యార్థుల పురోగతిని పరిశీలిస్తారు.

దోషాలు తెలుస్తాయి
బోధన కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పఠన సామర్థ్యం పెరుగుతుంది. బిగ్గరగా చదవడం వల్ల దోషాలు తెలుస్తాయి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి బుధవారం ఈ కార్యక్రమం అమలు చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా చదువులో విద్యార్థులు పురోగతి సాధిస్తారు.
–కానుగుల నర్సింహ, డీఈఓ
చదవండి👉🏻స్కూల్‌కు వచ్చే సమయంలో తీవ్రమైన తలనొప్పి.. టీచర్‌ బ్రెయిన్‌ డెడ్‌.. జీవన్‌ దాన్‌ సంస్థ ద్వారా

మరిన్ని వార్తలు