కేన్సర్‌ కోరలు చాస్తోంది! 

2 Oct, 2021 04:16 IST|Sakshi

కోవిడ్‌ మహమ్మారి ఏడాదిన్నర కాలంలో.. దేశంలో బలితీసుకున్న ప్రాణాలు దాదాపు 4,50,000. కానీ.. భారత్‌లో ఏటా కేన్సర్‌ పొట్టనబెట్టుకుంటున్నది.. అక్షరాలా.. 7,84,000 మందిని! ఈ లెక్క మూడేళ్ల క్రితం నాటిది. 2021లో ఇది మరింత పెరిగిందే కానీ తక్కువైతే కాదు! ఎందుకిలా? మనం చేయాల్సిందేమిటి?  

బంధుమిత్రుల్లో ఏ ఒక్కరితో కాసేపు మాట్లాడినా.. ఎవరో 
ఒకరి కేన్సర్‌ గురించి ప్రస్తావన రాక మానదు. దేశంలో దశాబ్దకాలంగా కేన్సర్‌ కేసులు పెరిగిపోతున్నాయని జాతీయ కేన్సర్‌ రిజిస్ట్రీ (కేన్సర్‌ కేసులన్నింటినీ నమోదు చేసే వ్యవస్థ) తాజా నివేదిక చెబుతోంది. ఒకవైపు కరోనాతో పోరాడుతున్న సమయంలోనే గత ఏడాది దేశం మొత్తమ్మీద 13.92 లక్షల మంది కేన్సర్‌ బారినపడ్డారని ఈ నివేదిక స్పష్టం చేసింది. అంతేకాదు.. రానున్న నాలుగేళ్లు అంటే 2025 వరకూ ఈ సంఖ్య ఏటా 12% చొప్పున పెరగనుందని భారతీయ వైద్య పరిశోధన సమాఖ్య (ఐసీఎంఆర్‌), బెంగళూరులోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ఇన్ఫర్మేటిక్స్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఎన్‌సీడీఐఆర్‌) విభాగాలు చెబుతున్నాయి. ఆ లెక్కన 2025లో కనీసం 15.6 లక్షల మంది కొత్తగా కేన్సర్‌ బారినపడతారన్నమాట. వ్యాధిని గుర్తించడం మొదలుకొని చికిత్స, నివారణ విషయాల్లో వైద్యం ఎంతో పురోగతి సాధించినప్పటికీ ఈ పరిస్థితి ఎందుకు?  

ఆయుఃప్రమాణాలు పెరగడమూ కారణమే!
దేశంలో సగటు ఆయుఃప్రమాణం 1960లో 41.42 ఏళ్లు ఉంటే.. 2018 నాటికి ఇది 69.2 ఏళ్లకు పెరిగింది. దేశంలో కేన్సర్‌ కేసు లు పెరిగేందుకు ఇది కూడా ఒక కారణం. ఆయుఃప్రమాణాలు పెరిగాయంటే.. మనిషి ఎక్కువ కాలం జీవించగలడు.. ఆ క్రమంలో కేన్సర్ల బారిన పడే అవకాశమూ ఉంటుంది. కణ విభజన ప్రక్రియలో నిత్యం కొన్ని తప్పులు జరగడం పుట్టినప్పటి నుంచే ఉన్నా.. యుక్తవయసులో వాటిని సరిదిద్దుకునే వ్యవస్థ చురుకుగా ఉండటం వల్ల సమస్యలు తక్కువగా వస్తాయి.

వయసు పెరిగిన కొద్దీ ఈ తప్పులు ఎక్కువవుతాయి. ఫలి తంగా కేన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువ అవుతుంది. మరి యువకుల్లో వచ్చే కేన్సర్ల సంగతేమిటి అంటారా? జీవనశైలి మార్పులతోపాటు కొన్ని కుటుంబాల్లో కేన్సర్‌ కారక జన్యుమార్పులు వారసత్వంగా రావడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది.  

వ్యాధి గుర్తింపు సౌకర్యాల పెరుగుదల... 
ఇప్పుడు దేశంలో కేన్సర్‌ గుర్తింపునకు ఉన్న సౌకర్యాలు గణనీయంగా పెరిగాయి. ఒకప్పుడు మహా నగరాలకే పరిమితమైన కేన్సర్‌ స్క్రీనింగ్‌ సెంటర్లు ఇప్పుడు టైర్‌–2, టైర్‌–3 నగరాలకూ విస్తరించాయి. ఈ పరీక్షల కారణంగా చాలామంది కేన్సర్లను తొందరగానే గుర్తించగలుగుతున్నారు. ఫలితంగా వీరు ఆ వ్యాధిని సమర్థంగా ఎదుర్కొనే అవకాశాలూ మెరుగవుతున్నాయి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 38 జనాభా ఆధారిత కేన్సర్‌ రిజిస్ట్రీలు ఉండగా ఇవన్నీ నిర్దిష్ట ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, నర్సింగ్‌హోమ్‌లు, ప్రైవేట్‌ ఆసుపత్రులు, వ్యాధి నిర్ధారణకేంద్రాలు, జనన, మరణ ధ్రువీకరణ కేంద్రాల వంటి వాటి ద్వారా కేన్సర్‌ కేసులను నమో దు చేస్తాయి. ఇవన్నీ కూడా దేశజనాభాలో కనీసం 10% నుంచి సమాచారం సేకరిస్తున్నాయి. ఇక ఆసుపత్రి ఆధారిత కేన్సర్‌ రిజిస్ట్రీలు దేశంలో 250 వరకూ ఉన్నాయి.   

నివారణ ఎలా? 
కేన్సర్‌ను నివారించేందుకు ఉన్న తారకమంత్రం.. ఏ రూపం లోనూ పొగాకును తీసుకోకపోవడం. బాగా శుద్ధి చేసిన, రెడీమేడ్‌ ఆహారాన్ని నివారించడం. రోజూ కనీసం అరగంటపాటు శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయడం కూడా అవసరమే.

ఆధునిక జీవనశైలిలో అత్యంత ప్రధాన అంశమైన ఒత్తిడిని తగ్గించుకోవడమూ కేన్సర్‌ను దూరంగా ఉంచేందుకు కీలకం. ఒత్తిడి కారణంగా కేన్సర్‌ బారినపడ్డవారు ఎందరు? అన్న సమాచారం స్పష్టంగా లేకున్నా... ఒత్తిడి కాస్తా అధిక రక్తపోటుకు దారితీస్తుందని.. ఇది శరీరంలో పలు మార్పులకు కారణమవుతుందన్నది తెలిసిందే. 

గర్భాశయ ముఖద్వార కేన్సర్ల తగ్గుదల 
మహిళల్లో రొమ్ము కేన్సర్లు ఎక్కువ అవుతుండగా... ఊపిరితిత్తులు, తల, మెడ భాగాల్లో వచ్చే కేన్సర్లు మహిళలతోపాటు పురుషుల్లోనూ ఎక్కువ అవుతున్నాయి. అయితే మహిళలకు వచ్చే గర్భాశయ ముఖద్వారా కేన్సర్ల సంఖ్యలో మాత్రం తగ్గుదల కనిపిస్తోంది.

అధిక శాతం ఊపిరితిత్తుల కేన్సర్లను ఇతర అవయవాలకు విస్తరించిన తరువాత మాత్రమే గుర్తిస్తున్నారు. తల, మెడ, కడుపు, రొమ్ము, గర్భాశయ ముఖద్వారా కేన్సర్లలో అధికం పరిమితస్థాయి వ్యాపించిన తరువాత గుర్తిస్తున్నారు. 

ఇరవై ఏళ్లకు రెట్టింపు 
ఆయుఃప్రమాణాలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో కేన్సర్‌ కేసులు 20 ఏళ్లకు ఒకసారి రెట్టింపు అవుతుంటాయని రెండేళ్ల క్రితం జర్నల్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఆంకాలజీలో ప్రచురితమైన ఒక పరిశోధన పత్రం తెలిపింది. ‘హిస్టరీ ఆఫ్‌ ద గ్రోయింగ్‌ బర్డన్‌ ఆఫ్‌ కేన్సర్‌ ఇన్‌ ఇండియా: ఫ్రమ్‌ యాంటిక్విటీ టు ద ట్వంటీఫస్ట్‌ సెంచరీ’ పేరుతో ప్రచురితమైన ఈ పరిశోధనను కోల్‌కతాలోని టాటా మెడికల్‌ సెంటర్‌కు చెందిన మోహన్‌దాస్‌ కే మల్లత్, లం డన్‌లోని కింగ్స్‌ కాలేజీ డాక్టరల్‌ విద్యార్థి రాబర్ట్‌ స్మిత్‌లు సిద్ధం చేశారు.

బ్రిటిష్‌ లైబ్రరీతోపాటు లండన్‌లోనే ఉన్న వెల్‌కమ్‌ కలెక్షన్‌ లైబ్రరీల్లో భారత్‌లో కేన్సర్‌ వ్యాధిపై ఉన్న రెండు వందల ఏళ్ల పరిశోధన పత్రాలను వీరు పరిశీలించారు. దీంతో భారత్‌లో కేన్సర్‌ కేసులు పెరిగేందుకు జీవనశైలి మార్పులు ఒక్కటే కార ణం కాదన్న అంచనాకు రాగలిగామని మల్లత్‌ పేర్కొ న్నారు. ‘1900లలో జననాలతోపాటు మరణాలూ ఎక్కు వగా ఉండేవి. ఆ దశ నుంచి క్రమేపీ జననాలు ఎక్కువ, మరణాలు తక్కువన్న స్థితికి వచ్చాం.

భవిష్యత్తులో జననాలు, మరణాలు తక్కువ ఉండే స్థితికి కొన్ని రాష్ట్రాలు చేరుకోవచ్చు. ఫలితంగా ఆయుఃప్రమాణాలు పెరిగిన చోట కేన్సర్ల వంటి వ్యాధులు పెరిగే చాన్స్‌ ఉంటుంది’ అని చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఈ రకమైన మా ర్పులు వివిధ దశల్లో ఉన్నాయని.. ఎపిడిమియలాజికల్‌ ట్రాన్సిషన్‌ లెవెల్‌ (ఈటీఎల్‌) అని పిలిచే ఈ మార్పులు కేరళలో ఎక్కు వగా, యూపీలో తక్కువగా ఉన్నాయని మల్లత్‌ తెలిపారు. ఈటీఎల్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మానవాభివృద్ధి సూచికలు మెరుగ్గా, కేన్సర్‌ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటుందన్నారు.   

భోర్‌ కమిటీ అమలే శరణ్యం 
కేన్సర్‌ను వీలైనంత త్వరగా గుర్తించి చికిత్స కల్పించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. కేన్సర్‌ చికిత్సలను ప్రైవేట్‌ ఆసుపత్రులకు వదిలివేయరాదు. ప్రైవేట్‌ ఆసుపత్రుల చికిత్సలు ఎంత ఖరీదైనవో తెలియంది కాదు. కేన్సర్‌ కేసులను తగ్గించాలనుకుంటే కేంద్రం చేయగల ప్రాథమిక అంశం 1946 నాటి భోర్‌ కమిటీ నివేదికను, ముదలియార్‌ కమిటీ నివేదికలను అమలు చేయడమే. అన్ని వైద్య కళాశాలల్లో మల్టీ డిసిప్లి నరీ కేన్సర్‌ చికిత్స విభాగాలను ఏర్పాటు చేయాలని, కేరళలోని రీజనల్‌ కేన్సర్‌ సెంటర్‌ మాదిరి ఆసుపత్రిని జిల్లాకొకటి ఏర్పాటు చేయాలని ఈ నివేదికలు ప్రభుత్వానికి సూచించాయి.   

జీవనశైలి మార్పుల ప్రభావం? 
దేశంలో కేన్సర్‌ కేసులు పెరిగిపోవడం వెనుక జీవన శైలి  మార్పులు ఒక కారణ మని వైద్య నిపుణుల అంచనా. అనారోగ్యకర మైన ఆహార అలవాట్లు, పాల ఉత్పత్తిలో కృత్రిమ హార్మోన్ల వాడకం, బాగా శుద్ధి చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల కొన్ని రకాల కేన్సర్లు ఎక్కువ అవుతోంటే.. రెడీమేడ్‌ ఆహారానికి చేర్చే రసాయనాలు, మాంసాహారం, రసాయన కాలుష్యం, మలబద్ధకం, శారీరక శ్రమ, వ్యాయామాల లేమి కూడా తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి.


దేశంలో నమో దవుతున్న కొత్త కేన్సర్‌ కేసుల్లో 27 శాతం పొగాకు వాడకం వల్ల వస్తున్నవే. పనిగంటలు ఎక్కువగా ఉండటం, మానసిక ఒత్తిడితో కూడిన జీవితాలు, ధూమ పానం, మద్యపానం, గర్భనిరోధక మాత్రల వాడకం వంటివి మహిళల్లో రొమ్ము కేన్సర్‌లు వచ్చేందుకు కారణాలుగా మారుతున్నాయి. పురుషులతో పోలిస్తే సాధారణంగా మహిళలు ఎక్కువ కాలం జీవించడం కూడా వారు కేన్సర్‌ బారిన పడే అవకాశాలను పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఎక్కడెన్ని?  
దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 2018లోనే 2,70,053 కేసులు నమోదు కాగా మహారాష్ట్రలో అదే ఏడాది 1,44,032 కొత్త కేసులు నమోదయ్యాయి. పశ్చిమబెంగాల్‌లో 1.08 లక్షల కేసులు ఉండగా బిహార్‌లోనూ లక్ష పైమాటే. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన మూడేళ్లుగా సగటున 69 వేల వరకూ కొత్త కేన్సర్‌ కేసులు నమోదవుతున్నట్టు జాతీయ కేన్సర్‌ రిజిస్ట్రీ వెల్ల డించింది. మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.

మరిన్ని వార్తలు